Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి గ్రామానికి... ప్రతి మూలకు వెళ్లేలా వ్యూహం
- రైతు ఆందోళనలు మరింత తీవ్రతరం
- సెప్టెంబర్ 25న భారత్ బంద్
- సెప్టెంబర్ 5న ముజఫర్నగర్లో భారీ బహిరంగ సభ: ఎస్కేఎం జాతీయ కన్వెన్షన్ పిలుపు
- వివిధ సమస్యలపై పలు తీర్మానాలు ఏకగ్రీవ ఆమోదం
- ముగిసిన రెండు రోజుల ఎస్కేఎం జాతీయ కన్వెన్షన్
న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి మూలకు రైతు ఉద్యమాన్ని విస్తరించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జాతీయ కన్వెన్షన్ పిలుపు ఇచ్చింది. అలాగే దేశంలో జరుగుతున్న రైతు ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేసింది. మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రారంభమైన చారిత్రాత్మక రైతు ఉద్యమం తొమ్మిది నెలలు పూర్తి చేసుకున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింఘూ ప్రాంతంలో రెండు రోజుల పాటు ఎస్కెఎం నిర్వహించిన జాతీయ కన్వెన్షన్ శుక్రవారం ముగిసింది. మొత్తం రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ కన్వెన్షన్లో వివిధ రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక, మహిళ, విద్యార్థి, యువజన, చిరు వ్యాపార సంఘాలకు చెందిన మొత్తం 90 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. రైతుల డిమాండ్ డిమాండ్లు, ప్రజల డిమాండ్లపై తీర్మానాలను కన్వెన్షన్ ఆమోదించింది. అలాగే మైనారిటీలపై మతపరమైన దాడులను ఎస్కేఎం కన్వెన్షన్ వ్యతిరేకత వ్యక్తం చేసింది.
అలాగే దేశ సహజ ఆస్తులు, ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలకు అమ్మడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. సంబంధిత అంశాలపై తీర్మానాలు ఆమోదించింది. దీంతో పాటు భవిష్యత్ కార్యచరణను ప్రకటించింది. సెప్టెంబర్ 25న భారత్ బంద్ నిర్వహించాలని పిలుపిస్తూ తీర్మానాన్ని కన్వెన్షన్ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు పేర్కొంది. అలాగే ''మిషన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్''లో భాగంగా ముజఫర్నగర్లో సెప్టెంబర్ 5న జరిగే భారీ బహిరంగ సభను భారీ నిరసన ప్రదర్శనగా మార్చాలని రైతులకు ఎస్కేఎం విజ్ఞప్తి చేసింది.
ప్రయివేటీకరణపై ఆగ్రహం
వ్యవసాయం, ఆహార నిల్వ వంటి అన్ని అంశాలపై కార్పొరేట్, బహుళ జాతి కంపెనీల నియంత్రణలో పనిచేసే ప్రభుత్వంతో పోరాడవలసి వచ్చిందని పేర్కొంది. ఈ నల్ల చట్టాలతో వచ్చిన మార్పులు రైతుల అప్పులు, ఆత్మహత్యలు, భూమి నుంచి రైతులను వేరుచేయడం పెరగడానికి దారితీస్తుందని తెలిపింది. ఈ దాడి రైతులు, వ్యవసాయ కార్మికులకు మాత్రమే పరిమితం కాదనీ, దేశంలోని అన్ని వర్గాల ప్రజలపై కూడా దాడి చేయడమేనని విమర్శించింది. దేశ ఆస్తులు దేశాభివృద్ధిని నిర్ధారించడానికి, రైల్వే, పవర్ ట్రాన్స్మిషన్ లైన్లు, సహజ వాయువు వనరులు, టెలికాం ప్రాజెక్టులు, ఆహార నిల్వ, భీమా, బ్యాంకులు వంటివి ప్రజలకు ఉపాధి, భద్రతను అందించడానికి ఉద్దేశించినవనీ, కానీ వాటిని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించింది. నాలుగు లేబర్ కోడ్లతో కార్మికుల ప్రాథమిక హక్కులపై దాడి జరుగుతుందని విమర్శించింది.
పేదల సంక్షేమం, సేవా రంగం, ప్రత్యేకించి సబ్సిడీలు, ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించింది. నిత్యావసర వస్తువుల ధరలు, ముఖ్యంగా ఇంధనం ధరలు భారీగా పెరుగుతున్నాయని, ప్రభుత్వ ఆరోగ్య సేవలు, విద్యా రంగం ప్రయివేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆర్థికాభివృద్ధి పేరుతో మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని కార్పొరేట్ లాభాల పెరుగుదలకు సహాయం చేయడానికి మోడీ సర్కార్ ప్రయత్నిస్తుందని విమర్శించింది. ప్రజల స్వేచ్ఛ, చైతన్యాన్ని నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడే హిందూత్వ పేరుతో ఫాసిస్ట్ దాడుల ద్వారా సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపించింది.
కార్పొరేట్ల స్వాధీనం నుంచి దేశాన్ని కాపాడేందుకు పోరాటం
తమపై ప్రభుత్వం చేసిన దాడిని సవాలు చేసిన ఈ చారిత్రాత్మక రైతుల పోరాటం, కేవలం రైతుల స్వంత మనుగడ కోసం మాత్రమే కాదనీ, ఇది దేశాన్ని పూర్తిగా దేశీయ, విదేశీ కార్పొరేట్లు స్వాధీనం చేసుకోకుండా కాపాడటానికి ఉపయోగపడుతుందని కన్వెన్షన్ స్పష్టం చేసింది. ఇది దేశభక్తి గల పౌరుల జీవితాన్ని, జీవనోపాధిని కాపాడే నిజమైన స్వీయ ఆధారిత వద్ధికి సంబంధించిన మార్గమని తెలిపింది. ఈ పోరాటం కోట్లాది మంది విశ్వాసాన్ని ప్రేరేపించిందని, రాబోయే రోజుల్లో అలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది. కార్పొరేట్ లాభాల ప్రయోజనాలకు సేవ చేయాలనే గుడ్డి నిబద్ధతతో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రైతులు భారీ, ప్రజాస్వామ్య, శాంతియుత ఉద్యమాన్ని నిర్మించారని తెలిపింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎంతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, మోడీ ప్రభుత్వం నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తున్నప్పటికీ తమ పోరాటం శాంతియుతంగా కొనసాగుతుందని కన్వెన్షన్ నొక్కి చెప్పింది. దోపిడీ నుండి దేశాన్ని రక్షించడానికి శాంతియుత నిరసనలను కొనసాగించాలని రైతులను ప్రోత్సహించింది. ఈ ఉద్యమం మతాలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేయడంలో గొప్ప విజయం సాధించిందని పేర్కొంది. ఈ పోరాటం కార్పొరేట్ దోపిడీకి అతీతంగా, స్వయం సమృద్ధ భారతాన్ని నిర్మించడంలో అత్యంత అణగారిన వర్గాల విశ్వాసాన్ని, భాగస్వామ్యాన్ని ప్రేరేపించిందని కన్వెన్షన్ స్పష్టం చేసింది.
రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కన్వెన్షన్లు
రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఎస్కెఎం యూనిట్లను ఏర్పాట్లు చేసి, కన్వెన్షన్లను ఏర్పాటు చేయాలని పిలుపు ఇచ్చింది. అలాగే రాష్ట్రాలు, జిల్లాల్లో రైతు పోరాటాలు నిర్మించాలని పేర్కొంది. రాష్ట్ర, జిల్లా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించింది. రైతుల దేశభక్తితో కూడిన డిమాండ్లను అంగీకరించడానికి నిరాకరించినందుకు బీజేపీ, ఎన్డీఏ నాయకులకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని రైతులకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఆశిష్ మిట్టల్, బల్బీర్ సింగ్ రాజేవాల్, అశోక్ ధావాలే, జగ్జిత్ సింగ్ దల్లెవాల్, ప్రేమ్ సింగ్ భంగూ, ధర్మేంద్రర్ మాలిక్, బల్దేవ్ సింగ్ నిహల్గఢ్, అవిక్ సాహా, సత్యవన్, సత్నం సింగ్ అజ్ఞాలా, హర్పాల్ సింగ్, ప్రేమ్ సింగ్ ఘెలావత్, జగమోహన్ సింగ్, హర్మిత్ సింగ్ కడియన్, కిరణ్జిత్ సెఖోన్, జై కరణ్ తదితరులు పాల్గొన్నారు.