Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు రోజులైనా పట్టుకోని కర్నాటక పోలీసులు
బెంగళూరు : కర్ణాటకలోని మైసూర్లో ఈనెల 24న చోటుచేసుకున్న లైంగికదాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు. ఈ ఘటన జరిగి 72 గంటలకు పైగా గడిచినా పోలీసులు ఎటువంటి కీలక సాక్ష్యాధారాలు సంపాదించలేదు. అదనపు డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో 80 పోలీసు బృందాలు ముంబయి కార్పొరేషన్ పరిధిలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనాస్థలిలో ఒక బీరు సీసాను మాత్రమే స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని ఎక్కడ కొనుగోలు చేశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఈ బాటిల్‌ను కర్నాటక, తమిళనాడు సరిహద్దులోని అట్టిబేలెలో కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మరోవైపు మాజీ ఎంపీ ఉగ్రప్ప ఆధ్వర్యంలో ఒక నిజనిర్ధారణ కమిటీని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శివకుమార్ నియమించారు. ఈ కమిటీ సభ్యులు ఘటనాస్థలిని పరిశీలించి స్థానికులతో పాటు పోలీసుల నుంచి కొంత సమాచారం సేకరించారు. మైసూర్‌లోని చాముండి హిల్ ప్రాంతంలో ఈనెల 24న ఒక ఎంబీఏ విద్యార్థినిపై దుండుగులు సామూహిక లైంగికదాడికి పాల్పడడంతో పాటు ఆమె స్నేహితుడిని తీవ్రంగా కొట్టి గాయపరిచిన విషయం తెలిసిందే.
హోంమంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం
అఘాయిత్య ఘటనకు సంబంధించి రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటనా ప్రాంతంలో బాధితులు అక్కడ ఆ సమయంలో ఎందుకు ఒంటరిగా తిరుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. జ్ఞానేంద్ర వ్యాఖ్యలను పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు సమర్ధించడం గమనార్హం. లైంగికదాడి ఘటనలు సహజమనీ, వాటిని నియంత్రించడం సాధ్యం కాదని మరో మంత్రి ఉమేష్ కత్తి వ్యాఖ్యానించారు. బిజెపి మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా మైసూర్లో ఉన్న హోంమంత్రికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.