Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అస్పత్రుల్లో భద్రతా ప్రమాణాల సడలింపుపై గుజరాత్ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- ఇటుంటి చర్యలేంటి? అని అసహనం
- ప్రభుత్వ ఉత్తర్వుల నిలిపివేత
న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల భవనాల భద్రతా ప్రమాణాల నిబంధనల విషయంలో సడలింపులు ఇస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి గుజరాత్‌లోని బీజేపీ సర్కార్ జులై 8న ఇచ్చిన ఉత్వర్వులను నిలిపేసిన న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. '' మహమ్మారి సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాల్సిన సమయంలో మనం అగ్నిప్రమాదాల కారణంగా మంటల్లో రోగులను చంపుకుంటున్నాం'' అని ఆవేదన వ్యక్తం చేసింది. 'బిల్డింగ్ యూజ్ పర్మిషన్' లేని భవనాలపై వచ్చే ఏడాది మార్చి వరకు ఎటువంటి చర్యలు తీసుకోబోమని గుజరాత్ ప్రభుత్వం గతనెల 8న ఉత్తర్వులు జారీచేసింది. ఈ నోటిఫికేషన్ ప్రజారోగ్యం, భద్రతకు విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. గతేడాది ఆగస్టు నెలలో అహ్మదాబాద్‌లోని శ్రేరు ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది కరోనా రోగులు మరణించిన విషయం తెలిసిందే. అదేవిధంగా నవంబర్‌లో రాజ్‌కోట్‌లోని శివానంద్ ఆసుపత్రిలో ఆరుగురు చనిపోయారు. ఈ ఏడాది మేలో బారుచ్‌లోని ఒక ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 18 మంది మృతిచెందారు. అగ్నిప్రమాదాల ఘటనలపై స్పందించిన సుప్రీంకోర్టు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రుల్లో అగ్నిమాపక భద్రతా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే ఆస్పత్రుల్లో జరిగిన ఈవిధమైన భయానక ప్రమాదాల తర్వాత కూడా గుజరాత్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భద్రతా నిబంధనల పాటింపులో సడలింపు ఇవ్వడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. '' అవసరమైన అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా 30 ఏండ్లకు పైగా నడుస్తున్న ఆస్పత్రులు ఉన్నాయి. చట్టాలను ఉల్లంఘించే వారికి మాత్రమే మనం నిరంతరం మినహాయింపులు ఇస్తున్నాం. ఈ దేశంలో మనం చేస్తున్నది ఇదే'' అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అటువంటి అక్రమ భవనాలను ప్రభుత్వం అనుమతించకూడదని, అలాచేయడం ఎంతమాత్రం సురక్షితం కాదని జస్టిస్ డివై.చంద్రచూడ్ నొక్కిచెప్పారు. ఒక చిన్న రూమ్‌లో 7-8 బెడ్లతో కూడిన ఐసీయూ ఉన్న పరిస్థితిని మీరు గమనించారా? అని గుజరాత్ ప్రభుత్వ తరపు న్యాయవాదిని జస్టిస్ ఎంఆర్.షా ఈ సందర్భంగా ప్రశ్నించారు. అగ్నిమాపక భద్రతకు సంబంధించిన నిబంధనలను సడలించడం తమ నోటిఫికేషన్ అర్థం కాదని గుజరాత్ ప్రభుత్వం ఈ సందర్భంగా పేర్కొంది. అయితే బిల్డింగ్ యూజ్ పర్మిషన్లు వాటితో సమానమైనవని స్పష్టం చేసిన న్యాయస్థానం.. అనేక ఆస్పత్రులు వాటిని ఇంకా పొందకపోవడం చాలా భయంకరంగా ఉన్నదని పేర్కొంది. కోవిడ్-19 సమయంలో ఇటువంటి ఆస్పత్రులు కోట్లాది రూపాయలు సంపాదించాయని, అగ్నిప్రమాదాల్లో మరణించిన బాధిత కుటుంబాలకు వారే పరిహారం చెల్లించేలా ఆదేశించాలని బాధితుల తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోర్టును కోరారు.