Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2019-20లో రూ.3,429.56 కోట్ల ఎన్నికల బాండ్లను విడిపించుకున్న పార్టీలు : ఏడీఆర్ తాజా నివేదిక
అత్యధిక విరాళాలు బీజేపీకే
న్యూఢిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.3,429.56 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు విడిపించుకున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో అధికంగా 87.29 శాతం వాటా నాలుగు పార్టీలదేనని పేర్కొంది. అందులో బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీలు ఉన్నాయి. ఎన్నికల బాండ్ల ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.3,623.28 కోట్ల విరాళాలు వచ్చాయని బీజేపీ ప్రకటించిందనీ, అయితే, అందులో 45.57 శాతం (రూ.1,651.022 కోట్లు) ఖర్చు చేసినట్టు ఏడీఆర్ తెలిపింది. ఇదేకాలంలో కాంగ్రెస్ పార్టీ విరాళాలు రూ.682.21 కోట్లు కాగా, ఆ పార్టీ అధికంగా.. రూ.998.158 కోట్లు ఖర్చు చేసింది. టీఎంసీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.143.676 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. ఇందులో రూ.107.277 కోట్లు (74.67 శాతం) ఖర్చు చేసినట్టు ఏడీఆర్ నివేదిక తెలిపింది.ఏడీఆర్ ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా.. ఎస్బీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ''రూ.3,429.5586 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను 2019-20 ఆర్థిక సంవత్సరంలో పార్టీలు విడిపించుకున్నాయి. ఇందులో 87.29 శాతం నాలుగు జాతీయ పార్టీలు - బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీలు అందుకున్నాయి'' అని వెల్లడించింది. ఇక 2019-20లో అన్ని పార్టీలు ఎన్నికల పొందిన ఎన్నికల బాండ్ల విలువ రూ.3,441.324 కోట్లు. ఎన్నికల బాండ్లు, పార్టీలు ప్రకటించిన విరాళాల మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ.. ఆయా పార్టీలు తమ వార్షిక ఆడిట్లో నివేదించవచ్చునని పేర్కొంది. అలాగే, ''ఏడు జాతీయ పార్టీలు (బీజపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం), ఎన్సీపీ, బీఎస్పీ, ఏఐటీసీ,సీపీఐ) దేశవ్యాప్త సేకరణ ద్వారా అందిన ఆదాయం రూ.4,758.206 కోట్లుగా పార్టీలు ప్రకటించాయని ఏడీఆర్ తెలిపింది. ఇందులో అత్యధిక విరాళాలు రూ.3,427.775 కోట్లు బీజేపీకి రాగా, ఆ తర్వాతి స్థానంలో కాంగ్రేస్ (రూ.469.386 కోట్లు), ఏఐటీసీ (రూ.108.548 కోట్లు), సీపీఐ(ఎం) (రూ.93.017 కోట్లు), సీపీఐ (రూ.3.024 కోట్లు)లు ఉన్నాయని ఏడీఆర్ వెల్లడించింది. కాగా, 2018-19 నుంచి 2019-20 మధ్య బీజేపీ ఆదాయం రూ.2,410.08 కోట్ల నుంచి రూ.3,623.28 కోట్లకు అంటే 50.34 శాతం (రూ.1,213.20 కోట్లు) పెరిగిందని కూడా తెలిపింది. ఇదే సమ యంలో కాంగ్రెస్ ఆదాయం రూ.918.03 కోట్ల నుంచి రూ.682.21 కోట్లకు అంటే 25.69 శాతం (రూ.235.82 కోట్లు) తగ్గింది.