Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత వెల్లడి
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది డిసెంబర్ ముగింపు నాటికి దేశంలో డిజిటల్ రూపీ ట్రయల్స్ ప్రారంభిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రస్తుతం చలామణీలో ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలకు ఆన్లైన్ రూపంగా డిజిటల్ రూపీ ఉంటుందన్నారు. ఓ ఆంగ్ల మీడియాతో ఆయన మాట్లాడుతూ కేంద్ర బ్యాంక్్ డిజిటల్ కరెన్సీలు(సీబీడీసీ)గా పేర్కొనే ఈ ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీ ఆన్లైన్లో చట్టబద్దంగా చెల్లుబాటు కానుందన్నారు. డిజిటల్ కరెన్సీ అనేది పూర్తిగా కొత్త పద్ధతి కావడంతో చాలా జాగ్రత్తగా వ్యవహారించనున్నామన్నారు. డిజిటల్ కరెన్సీ సెక్యూరిటీ, ద్రవ్య విధానంపై దీని ప్రభావం, చలామణీలో ఉన్న నగదుపై డిజిటల్ రూపీ ప్రభావం వంటి అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత డిసెంబర్ కల్లా దీని ట్రయల్స్‌ను ప్రారంభిస్తామన్నారు. ఈ కొత్త కరెన్సీకి ఒక కేంద్రీకృత లెడ్జర్‌ను ఉపయోగించాలా లేక బహుళ భాగస్వాములు కలిగిన డిజిటల్ డేటాబేస్‌ను నిర్వహించాలా అనే అంశంపై కూడా కసరత్తు జరుగుతుందన్నారు. ప్రజల్లో క్రిప్టోకరెన్సీలకు పెరుగుతున్న ఆసక్తి, నగదు వాడకం తగ్గడం వంటి కారణాలతో ఇప్పటికే బ్రిటన్, చైనా, యూరప్‌లు డిజిటల్ కరెన్సీల్ని వినియోగంలోకి తెచ్చే మార్గాలను అన్వేషిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా కష్టాల్లోనే ఉందని శక్తికాంత దాస్ అన్నారు. ఉత్పత్తి సామర్ధ్య వినియోగం ఇంకా కరోనాకు ముందున్న స్థాయికి దరిదాపుల్లో కూడా లేదని స్పష్టం చేశారు. ద్రవ్య పరపతి విధానంలో మార్పులకు ఇది సరైన సమయం కాదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుందనే స్పష్టమైన సంకేతాలు వెలువడే వరకు అసలు అలాంటి ఆలోచనే లేదన్నారు. ద్రవ్యోల్బణం పట్ల ఆందోళనలు తలెత్తుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లు పెంచబోమని శక్తికాంత దాస్ అన్నారు.