Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాల సీిఎంలు, యూటీిల అడ్మినిస్ట్రేటర్లకు
- పలువురు వైద్యులు, విద్యావేత్తల లేఖ
న్యూఢిల్లీ : పాఠశాలలను పున:ప్రారంభించి ప్రత్యక్ష తరగతుల నిర్వహణ అంశాన్ని తక్షణం పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ 56 మంది వైద్యులు, విద్యావేత్తలు, ఇతర రంగాల నిపుణులు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను ప్రధాన మంత్రి కార్యాలయంతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్షుక్ మాండవీయ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద ప్రదాన్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ చైర్‌పర్సన్‌కు పంపారు. పాఠశాలల పున:ప్రారంభానికి విద్యార్థులకు వ్యాక్సిన్ ముందస్తు అవసరం కాదని లేఖలో వారు పేర్కొన్నారు. ''విద్యార్ధులు టీకాలు వేయకపోవడం, పాఠశాలలు సూపర్-స్ప్రెడర్స్‌గా మారే ప్రమాదం, మూడో దశ భయం, పాఠశాలలు తెరిచిన ప్రాంతాల్లో కేసులు పెరుగుతాయి.. వంటి ఆందోళనల కారణంగా అనేక ప్రభుత్వాలు అన్ని తరగతులకు పాఠశాలలను ఇంకా తెరవలేదు. అయితే పాఠశాల పున:ప్రారంభానికి మద్దతుగా పలు గ్లోబల్ సాక్ష్యాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో పాఠశాలలు తిరిగి తెరవడం, వ్యక్తిగత తరగతులను తిరిగి ప్రారంభించడం గురించి ప్రభుత్వాలు అత్యవసరంగా ఆలోచించాలి, ''అని సూచించారు. ఇంత ఒకటిన్నర సంవత్సర సుదీర్ఘమైన కాలంగా పాఠశాలలను మూసివేసిన ప్రపంచంలోని నాలుగైదు దేశాల్లో భారత్ ఉందని, ఇది దేశంలోని పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. భారత వైద్య పరిశోధన మండలి( ఐసిఎంఆర్) సిఫార్సులకు అనుగుణంగా మొదట ప్రైమరీ స్కూళ్లను, తరువాత పై తరగతులను తెరవాలని అన్నారు. తీవ్రమైన లేదా ప్రాణాంతమైన కోవిడ్-19కి పిల్లలు తక్కువ ప్రమాదం కలిగివున్నారని, పాఠశాలలను తిరిగి తెరిచేందుకు వారికి ముందస్తు వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదని పేర్కొన్నారు. లేఖపై సంతకం చేసిన వారిలో ఎపిడమియాలజిస్ట్ చంద్రకాంత్ లహారియా, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ జాతీయ అధ్యక్షుడు, లాన్సెట్ కమిషన్ కోవిడ్ -19 ఇండియా టాస్క్ ఫోర్స్ సభ్యుడు సునీలా గార్గ్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మాజీ అధ్యక్షుడు నవీన్ థాకర్, టీచ్ ఫర్ ఇండియా సిఇఒ షహీన్ మిస్త్రీ ఉన్నారు.