Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు ను కాపాడుకునేందుకు కృషి చేయాలి
- 'సుప్రీం' ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ
న్యూఢిల్లీ : మాతృభాష లేనిదే మనిషికి మనుగడ లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు ఉద్యమ స్థాయిలో భాషావేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 'వీధి అరుగు- దక్షిణాఫ్రికా తెలుగు సంఘం' సంయుక్తంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సదస్సులో ఆయన వర్చువల్ గా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ అమ్మభాషను మాట్లాడడం ఓ గౌరవంగా భావించాలని అన్నారు. ఆంగ్లం మోజులో పడి తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ''కాలానుగుణంగా భాషలో మార్పు రాకపోతే ఆ భాష, సంస్కృతి పతనమైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. చైతన్య వంతమైన తెలుగు సమాజం తమ సుదీర్ఘ చరిత్రలో నేటి వరకు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు భాషలో దిద్దుబాట్లు, సర్దుబాట్లు చేసుకుంటూ మనుగడ కొనసాగించగలుగుతోంది. తగు మార్పులతో ప్రగతిశీలకంగా భాషను మలచినటువంటి కవులు ఎందురో ఉన్నారు. గిడుగు రామ్మూర్తి, గురజాడ అప్పారావు, కందుకూరి విరేశలింగం వంటి సాహితీ, సామాజిక సంస్కరణలతో తెలుగు భాషను సామాన్య ప్రజల భాషగా మలిచారు'' అని రమణ అన్నారు. ''ఎందరో తారలను అందలమెక్కించిన సినిమా రంగంలో కూడా తెలుగు భాష పరిస్థితి దయనీయంగా ఉంది. తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంతగా ముప్పు పొంచి ఉంది. కాపాడుకునేందుకు ఉద్యమ స్థాయిలో భాషాభిమానులందరూ సిద్ధం కావాలి'' అని పిలుపు నిచ్చారు.''తెలుగు మాధ్యమంలో చదివితే భవిష్యత్ ఉండదనే అపోహలు తొలగించాలి. డిగ్రీ వరకు నేను తెలుగు మాధ్యమంలోనే చదివాను. ఉద్యోగ ధర్మం కనుక ఆంగ్లంలో అభ్యాసం, వాడకం కొనసాగిస్తున్నాను. పల్లెటూరిలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో మాతృభాషలో చదువుకుని ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. పాఠ్య పుస్తకాలు, విద్యా బోధన వ్యవహారికంలో కొనసాగడం నా లాంటి వారికి ఎంతో ఉపయోగపడింది. మనుషులంతా ఆలోచించేది మాతృభాషలోనే.. పోటీని తట్టుకోవాలంటే ఇతర భాషలను, ప్రధానంగా ఆంగ్ల భాషను విస్మరించలేం. అలా అని ఆంగ్లం కోసం తెలుగును త్యాగం చేయాల్సిన అవసరం లేదు.'' అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ద ప్రసాద్, గరికిపాటి నరసింహారావు, కొలకలూరి ఇనాక్, గిడుగు స్నేహలత, కార్యక్రమ నిర్వాహకులు పెట్లూరు విక్రమ్, తరిగోపుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.