Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హర్యానాలో బీజేపీ-జేజేపీ ప్రభుత్వం కర్నాల్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై క్రూరమైన హింసను అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శనివారం ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు అశోక్‌ధావలే, హన్నన్ మొల్లా ప్రకటన విడుదల చేశారు. అత్యంత దారుణమైన అంశం ఏమిటంటే, నిరసనకారుల ''తలలు పగలగొట్టేందుకు'' కర్నాల్‌లో మోహరించిన పోలీసు దళానికి కలెక్టర్ అవమానకరమైన ఆదేశాలు ఇచ్చారని విమర్శించారు. ఈ ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్‌ను వెంటనే తొలగించాలని ఏఐకేఎస్ డిమాండ్ చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ అమానవీయ చర్యల ద్వారా అపూర్వమైన రైతుల పోరాటాన్ని అణచివేయలేరని బీజేపీ-జేజేపీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని తెలిపారు. ఈ అణచివేత ప్రయత్నాలు రైతుల సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. పోలీసుల లాఠీఛార్జ్‌కు వ్యతిరేకంగా ప్రతిచోటా రోడ్లను దిగ్బంధం చేయాలని హర్యానా ప్రజలకు ఎస్కేఎం పిలుపునిచ్చింది. హర్యానా వ్యాప్తంగా రైతులు ఈ పిలుపును అందుకొని, ఇప్పటికే అనేక చక్కా జామ్ (రోడ్ల దిగ్బంధనం) లను నిర్వహించారని తెలిపారు. హర్యానాలో ఈ అనాగరిక అణచివేతను ఖండిస్తూ ఏఐకేఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.