Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానాలో లాఠీచార్జి
- పగిలిన అన్నదాతల తలలు
- 10 మందికి తీవ్ర గాయాలు
- ఉన్నతాధికారుల ఆదేశాలతోనే దాడి
- ఎస్కేఎం నేతల ఖండన
న్యూఢిల్లీ : హర్యానాలో అన్నదాతలపై పోలీసులు మరోసారి విరుచుకుపడ్డారు. రైతులపై అమానవీయంగా వ్యవహరించారు. మానవత్వాన్ని మంటగలిపారు. బక్కచిక్కిన రైతన్నల తలలను పగలగొట్టారు. అన్నదాత రక్తాన్ని కళ్లారా చూశారు. లాఠీలతో క్రూరంగా చితకబాదారు. మాబ్ లించింగ్ (మూక దాడి)లానే ఒక్కో రైతును టార్గెట్ చేస్తూ పోలీసులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల దాడిలో దాదాపు 10మంది వరకు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. కొంత మంది రైతులు గాయాలతో అక్కడిక్కడే కుప్పకూలారు. రైతు వ్యతిరేక బీజేపీ, ఎన్డీయే పక్షాల నేతల సామాజిక బహిష్కరణలో భాగంగా అధికార పార్టీ ఆధ్వర్యంలో జరిగే సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై హర్యానా పోలీసులు రెచ్చిపోయారు. రైతులపై దాడికి ఒడిగట్టిన హర్యానా బీజేపీ ప్రభుత్వంపై సంయుక్త కిసాన్ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖట్టర్ ప్రభుత్వం తీరును ఎస్కేఎం ఖండించింది. హర్యానాలోని బస్తర్‌లో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం శనివారం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒపి ధంఖర్ హాజరయ్యారు. ఈ సమావేశాన్ని అడ్డుకోవాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు కర్నాల్ జిల్లాలో ముందస్తుగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. రైతుల నిరసనతో కర్నల్, పానిపట్, అంబాలాలో టోల్ ప్లాజాలు మూసివేశారు. బీజేపీ ర్యాలీని అడ్డుకోవడానికి బయల్దేరిన రైతులను జాతీయ రహదారి 44పై ఉన్న బస్తర టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఆపారు. అయితే సీఎం కార్యక్రమానికి నిరసనగా కర్నాల్ వైపు వెళ్లాలని రైతులు ప్రయత్నించారు. దీంతో బస్తారా టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతులపై లాఠీచార్జీకి దిగారు. దొరికిన వారిని దొరికినట్టు చావబాదారు. పోలీసుల లాఠీ దాడి నుంచి తప్పించుకొని పరిగెత్తుతున్న రైతులను సైతం వెంటాడిమరీ చితకబాదారు. ఒక్కొక్క రైతును టార్గెట్ చేసి పోలీసులు గుంపు దాడికి ఒడిగట్టారు. దాదాపు 45 నిమిషాలు పాటు ఆ ప్రాంతమంతా యుద్ధవాతావరణాన్ని తలిపించింది. పోలీసుల దాడిలో 10 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో రైతుల తలలు పగిలాయి. వందలాది మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న బీకేయూ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చారుని అక్కడికి చేరుకున్నారు. ఆ తరువాత రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా గుర్నామ్ సింగ్ రైతులనుద్దేశించి మాట్లాడుతూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దనీ, శాంతియుతంగా నిరసన తెలియజేయాలని విజ్ఞప్తిచేశారు. కైతల్‌లో, చీకాలోని తిట్రామ్ మోర్ వద్ద రైతులు రోడ్లను దిగ్బంధించారు. పోలీసులు నిర్బంధించిన రైతులందరినీ విడుదల చేయాలని చారుని డిమాండ్ చేశారు. కర్నాల్ సిటీ ఎస్డీఎం ఆయుష్ సిన్హా, ఉన్నతాధికారుల ముందస్తు ఆదేశాలతోనే పోలీసులు ఈ దాడికి ఒడిగట్టారు. మరోవైపు పోలీసుల లాఠీచార్జ్‌ను వ్యతిరేకిస్తూ హర్యానాలోని చాలా ప్రాంతాల్లో రైతులు నిరసనకు దిగారు. 44వ జాతీయ రహదారి సహా రాష్ట్రంలోని అనేక రోడ్లను దిగ్బంధించారు. హర్యానాలోని ఖట్టర్ ప్రభుత్వం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక, దేశ వ్యతిరేక ప్రభుత్వాలని రైతుసంఘాల నేతలు విమర్శించారు. బస్తారా టోల్ ప్లాజా వద్ద పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా రైతులు జల్మన, అసంద్, నిస్సింగ్ వద్ద రహదారులను దిగ్బంధించారు. కురుక్షేత్రం, అంబాలా, జింద్, రేవారి, నర్వణ, ఫతేహాబాద్, సిర్సా, కిట్లానా టోల్, గోహనా, రోV్ాతక్, భివానీ, కేఎంపీ మొదలైన అనేకచోట్ల రైతులు జాతీయ రహదారులు దిగ్బంధించారు. టిక్రి సరిహద్దు సమీపంలో జఖోడా బైపాస్ వద్ద రైతులు ఢిల్లీ-రోV్ాతక్ హైవేని దిగ్బంధించారు. ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రదేశాల్లో రోడ్ల దిగ్బంధనం జరిగింది. లాఠీఛార్జికి నిరసనగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
లాఠీచార్జ్ ఆదేశాలిచ్చిన అధికారిని డిస్మిస్ చేయాలి : ఎస్కేఎం
ఒకపక్క ప్రధాని మోడీ 'జలియన్‌వాలాబాగ్' ర్యాలీని వర్చువల్‌గా ప్రారంభించారనీ, మరోపక్క కర్నల్‌లో బీజేపీ ప్రభుత్వం జలియన్ వాలాబాగ్ దురాగతాన్ని ఆవిష్కరించడం సిగ్గుచేటని ఎస్కేఎం విమర్శించింది. ఎన్ని దాడులు చేసినా రైతులు వెనక్కి తగ్గరని ఖట్టర్-చౌతాలా ప్రభుత్వాన్ని ఎస్కేఎం హెచ్చరించింది. ప్రజా వ్యతిరేక చర్యల ద్వారా ప్రజాదరణ పొందిన ప్రస్తుత చారిత్రాత్మక ఉద్యమాన్ని అణచివేయలేరని స్పష్టం చేసింది.
నిష్పాక్షిక దర్యాప్తు జరపాలి : హర్యానా మాజీ సిఎం భూపిందర్ సింగ్
హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా లాఠీఛార్జ్‌ను ఖండించారు. ''పోలీసుల అమానవీయ చర్యగా పేర్కొన్నారు. బీజేపీ సమావేశ వేదిక నుంచి 15 కిలోమీటర్ల దూరంలో రైతులు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఇది రైతుల రాజ్యాంగ హక్కు. ఈ చర్య ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని చూపిస్తుంది. ఈ మొత్తం ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి. తప్పు చేసిన పోలీసు సిబ్బంది, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి'' అని హుడా అన్నారు.