Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1.46 లక్షల కోట్ల డిపాజిట్లు: ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) ప్రారంభమై ఏడేండ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే జన్‌ధన్ ఖాతాలకు సంబంధించి ఆర్థిక శాఖ పలు వివరాలు వెల్లడించింది. ఈ జన్‌ధన్ యోజన పథకం కింద ఏడేండ్లలో జన్‌ధన్ బ్యాంక్ ఖాతాల సంఖ్య 43 కోట్లకు చేరింది. డిపాజిట్లు రూ.1.46 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ పేర్కొంది. కాగా, సామాన్య ప్రజలకు బ్యాంకింగ్, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పింఛను వంటి ఆర్థిక సేవలు సులభంగా అందుబాటులో ఉండే లక్ష్యంతో 2014 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పీఎంజేడీవైని ప్రకటించారు. అదే ఏడాది ఆగస్టు 28న దీనిని ప్రారంభించారు. 2014లో ఈ పథకం కింద తెరచబడిన బ్యాంకు ఖాతాల సంఖ్య 17.90 కోట్లు కాగా, ఈ ఏడాది ఆగస్టు 18 నాటికి ఇవి 43.04 కోట్లకు పెరిగాయి. వీటిలో 55.47 శాతం (23.87 కోట్లు) ఖాతాలు మహిళలవి ఉన్నాయి. అలాగే, మొత్తం ఖాతాల్లో 66.69 శాతం (28.70 కోట్లు) ఖాతాలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారివే ఉన్నాయి. మొత్తం 43.04 కోట్ల ఖాతాల్లో ప్రస్తుతం 85.6 శాతం (36.86 కోట్లు) ఖాతాలు క్రియాశీలకంగా ఉన్నాయి. కాగా, జన్‌ధన్ ఖాతాల్లో సరాసరి డిపాజిట్ మొత్తం పెరుగుతూ వస్తోందనీ, దీనర్థం వీటిని ప్రజలు వినియోగించుకుంటున్నారనీ, వారిలో పొదుపు అలవాటైందని ఆర్థిక శాఖ వివరించింది. ఈ అకౌంట్లు కలిగిన వారికి ప్రమాద బీమా మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచినట్టు పేర్కొంది. ఇందుకోసం 31.23 కోట్ల రూపే కార్డులను జారీ చేసినట్టు తెలిపింది. జన్‌ధన్ యోజన అమలుతో దేశం అభివృద్ధి పథం ఒక్కసారిగా మారిపోయిందంటూ ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఈ పథకంతో కోట్లాదిమంది భారతీయులకు సాధికారిత, ఆర్థికపరమైన గౌరవం దక్కాయని పేర్కొన్నారు.