Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవాగ్జిన్తోనే.. : ఐసీఎంఆర్ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే భారత వైద్య పరిశోధన మండలి నిర్వహించిన ఓ అధ్యయనం కీలక అంశా లను వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్నవారికి ఒక డోసు కోవాగ్జిన్ టీకా వేసినప్పుడు రెట్టింపు ప్రయోజనం కలుగుతోందని ఐసీఎంఆర్ వెల్లడించింది. కరోనా సోకనివారితో పోలిస్తే వీరికి ఒక డోసు వల్ల రెండు డోసుల స్థాయిలో యాంటీబాడీ స్పందన కలుగుతోందని తెలిపింది. తాజాగా ఐసీఎంఆర్ అధ్యయన వివరాలు 'ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్' ప్రచురించింది. అధ్యయనం నేపథ్యంలో ప్రాథమికంగా వెల్లడైన ఈ అంశాలు.. పూర్తిస్థాయి అధ్యయనాల్లోనూ రుజువైతే.. కరోనా నుంచి కోలుకున్నవారికి ఒకే డోసు కోవాగ్జిన్‌ను సిఫార్సు చేయవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో టీకాలు పరిమితంగానే సరఫరా అవుతున్న క్రమంలో కరోనా బారినపడని వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని అధ్యయనం పేర్కొంది.కాగా, కోవాగ్జిన్‌ను టీకాను ఐసీఎంఆర్, పూణేలోని జాతీయ వైరాలజీ ఇనిస్టిట్యూట్ల సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌ను 4-6 వారాల విరామంతో రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టీకాతో కోవిడ్ కారక వైరస్‌ను అడ్డుకునే తీరు.. యాంటీబాడీల స్పందనను పరిశీలించేందుకు ఐసీఎంఆర్ అధ్యయనం నిర్వహించింది. దీని కోసం చెన్నైలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే వరకూ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో కోవాగ్జిన్ మొదటి డోసు పొందిన 114 మంది ఆరోగ్య నిపుణులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లను నిపుణులు పరిశీలించారు. టీకా తీసుకున్న రోజు, ఆ తర్వాతి 28వ రోజు, 56 రోజుల తర్వాత వీరిలో యాంటీబాడీ స్పందనను పరిశీలించారు. వ్యాక్సిన్‌కు ముందు కరోనా సోకిన వారికి, ఇన్ఫెక్షన్ సోకనివారికి మధ్య ఈ స్పందనలో తేడాలను గమనించారు.