Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాచారాన్ని వక్రీకరిస్తున్న నిరంకుశ ప్రభుత్వాలు
- మేధావులు, వర్సిటీ విద్యార్థులు ప్రశ్నించే వైఖరి కలిగివుండాలి..
- ఆధునిక ప్రజాస్వామ్యంలో ఇదే కీలకం : సుప్రీంకోర్టు న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్
- ప్రభుత్వ సమాచారాన్ని గుడ్డిగా నమ్మాల్సిన పనిలేదు..
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రభుత్వాలు సమాచారాన్ని వక్రీకరిస్తున్నాయని, ప్రభుత్వం ఇచ్చే సమాచారమంతా నిజమని నమ్మాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ అన్నారు. ప్రభుత్వ సమాచారంలో అబద్ధాల్ని సమాజంలో మేధావులు, సాధారణ పౌరులు బయటపెట్టాలని ఆయన సూచించారు. కాలేజీ, వర్సిటీ విద్యార్థులు ప్రశ్నించే వైఖరిని కలిగివుండాలని ఆయన అన్నారు. ఆధునిక ప్రజాస్వామ్యంలో ఇదే కీలకమని చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమం లో పాల్గొన్న ఆయన 'స్పీకింగ్ ట్రూత్ టు పవర్ : సిటిజన్స్ అండ్ ద లా' అనే అంశంపై ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి.. ''ప్రజాస్వామ్యం బతకాలంటే నిజాలు బయటకు రావాలి. హద్దులేని అధికారం, నిరంకుశ ప్రభుత్వాలు తప్పుడు, వక్రీకరించిన సమాచారాన్ని విడుదల చేస్తాయి. ప్రజలపై ఆధిపత్యాన్ని చలాయించడానికే ఇదంతా. అయితే వాక్ స్వాతంత్య్రం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం. దీనిద్వారా ప్రభుత్వాల్ని ప్రశ్నించవచ్చు. ప్రభుత్వ సమాచారంలో అబద్ధాల్ని బయటపెట్టవచ్చు'' అని అన్నారు.
గుడ్డిగా నమ్మొద్దు!
ప్రభుత్వం ఇచ్చే సమాచారాన్ని పూర్తిగా విశ్వసించాల్సిన అవసరం లేదు. రాజకీయ కారణాలు చూపి తప్పుడు, వక్రీకరించిన సమాచారాన్ని ప్రభుత్వాలు విడుదల చేయరాదు. ఇందుకు ఉదాహరణ వియత్నాంపై అమెరికా యుద్ధం. పెంటగాన్ పేపర్స్ బయటకు వచ్చాకే అమెరికా ప్రభుత్వం అసలు స్వరూపం బయటపడింది. అలాగే కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో అనేక దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు వాస్తవ సమాచారాన్ని విడుదల చేయటం లేదు. దీనిని ఎదుర్కోవాలంటే మేధావులు, సాధారణ పౌరులు ప్రభుత్వాల్ని ప్రశ్నించాలి. అప్పుడే పత్రికా స్వేచ్ఛ, ప్రభుత్వ సంస్థల్లో ప్రజాస్వామ్యం బలపడుతుంది.