Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీలో10 కిలోమీటర్ల పొడవునా మానవహారం విజయవంతం
- బీజేపీ, బీఎంఎస్ మినహా మిగిలిన పార్టీల, సంఘాల మద్దతు
విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణపై మోడీ ప్రభుత్వం మొండి గా వ్యవహరిస్తోన్న నేపథ్యంలో ఉక్కు ఉద్యమాన్ని తీవ్రతరంలో భాగంగా నిర్వహించిన పది వేల మందితో పది కిలోమీటర్ల మానవహారం విజయ వంతమైంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునకు విశాఖకు చెందిన ఆబాల గోపాలం స్పందించింది. ఉక్కు కర్మాగారం పరిరక్షణకు పోరాట కమిటీ నిర్వహిస్తోన్న రిలే నిరాహార దీక్షలకు 200 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకూ అగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకూ జాతీయ రహదారిపై సుమారు పది కిలోమీటర్లు పరిధిలో మానవహారం జరిగింది. స్టీల్‌ప్లాంట్ జోలికొస్తే ఏ పార్టీ అయినా కాలగర్భంలో కలసిపోవడం ఖాయ మని, బీజేపీికీ అదే గతి పడుతుందని హెచ్చరించారు. మానవహారంలో స్టీల్‌ప్లాంట్ అధికారులు, బిహెచ్ఇఎల్, రక్షణ రంగం, వివిధ పరిశ్రమల కార్మికులు, ప్రజానీకం భాగస్వామ్యం కావడంతో అగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు జాతీయ రహదారిపై చాలాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బీజేపీ మినహా వైసీపీ, టీడీపీ, సీపీఐ(ఎం), సీపీఐ, జనసేన తదితర రాజకీయ పార్టీలు, బీఎంఎస్ మినహా సీఐటీయూ, ఐఎన్ టీియూసీ, ఎఐటీయూసీ, టీఎన్టీయూసీ, వైఎస్ఆర్టీయూసీ తదితర కార్మిక సంఘాలు, ఎస్సి, ఎస్టి ఉద్యోగుల సంఘాలు, యూటీఎఫ్, ఐద్వా, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పెన్షనర్స్ అసోసియేషన్, వంటి ప్రజా సంఘాలు ఈ మానవహారంలో పాల్గొన్నాయి. పది కిలోమీటర్ల మేర నినాదాలతో హోరెత్తాయి. బస్సుల్లో వెళ్తున్న ప్రజలు, వాహనాలపై వెళ్తోన్న జనం అన్ని తరగతులకు చెందిన వారూ ప్లాంట్ రక్షణకు మద్దతు తెలిపారు.