Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర భాషలను ద్వేషించడం సరికాదు
- సజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాలి: అంతర్జాతీయ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తికి నివాళి
న్యూఢిల్లీ : మాతృ భాష పట్ల అతి ప్రేమతో ఇతర భాషలను ద్వేషించడం సరికాదని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. అలాగే సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడం ఓ అభిరుచి (ప్యాషన్) కావాలన్నారు. దేశంలోని అనేక ప్రాచీన భాషల్లో ఒక్కటైన తెలుగును పరిరక్షించుకునీ, మరింత సమున్నతంగా తీర్చిదిద్దడమే గిడుగు రామ్మూర్తికి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. వాడుక భాష ఉద్యమ వ్యాప్తి ద్వారా తెలుగు భాషకు గొడుగు పట్టిన గిడుగు రామ్మూర్తి జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు నిర్వహించిన ''తెలుగు భవిష్యత్తు-మన బాధ్యత'' అంతర్జాల కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలిత గిడుగు రామ్మూర్తి చిత్ర పటానికి అంజలి ఘటించిన ఉపరాష్ట్రపతి, తెలుగు భాషను సమున్నతంగా తీర్చిదిద్దడమే గిడుగు వారికిచ్చే నిజమైన నివాళి అని తెలిపా రు.ప్రపంచంలోని అతి ప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటనీ, మన భాషను మనం పొగుడు కుంటూ కూర్చుంటే సరిపోదని అన్నారు. ఆత్మవిశ్వా సాన్ని పెంచే ఆలంబనగా పట్టం కట్టి, ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. తెలుగు భాష అందరికీ చేరువ కావా లన్న సంకల్పంతో గిడుగు వ్యావహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గ్రాంథికమే గ్రంథాల భాషగా చెలామణి అవుతున్న రోజుల్లో, పుస్తకాల్లోనూ సులభమైన తెలుగును వాడాలని ఉద్యమించారని గుర్తు చేశారు. మనుషి నుంచే పుట్టిన భాష కేవలం మాటల వారధి మాత్రమే కాదని, మన మూలాలను తెలియజేసి మనల్ని ముందుకు నడిపే సారధి అని అన్నారు. భాష మన అస్తిత్వాన్ని చెప్పడానికే కాదు, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి కూడా అని తెలిపా రు. ఎందరో కవులు తమ కావ్యాల్లో మన సంస్కృతిని నిక్షిప్తం చేశారనీ, అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వారు సామాజిక అభ్యుదయానికి బాటలు వేశారని తెలిపారు. తెలుగులో చదువుకో వడం, మాట్లాడడం ఆత్మన్యూనతగా భావించే భావదాస్యాన్ని వదలించుకోవాలని, ప్రముఖులంతా మాతృభాషలో చదువుకున్న వారమేనని గుర్తు చేశారు. తెలుగు భాషకు ఘనమైన ప్రాచీన చరిత్ర ఉన్నదనీ, ముందుతరాలకు అందించేందుకు భాష ఆధునీకరణ జరగాలని అన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు తెలుగు భాష పరిరక్షించుకునే దిశగా 16 సూత్రాలను ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ చైర్మెన్ సతీష్ రెడ్డి, టీటీడీ చైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు విక్రమ్ పెట్లూరి, వీధి అరుగు వ్యవస్థాపక అధ్యక్షులు వెంకట్ తరిగోపుల సహా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన భాషావేత్తలు, భాషాభిమానులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.