Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని రంగాల్లో యువత వేగం ప్రదర్శించాలి
- 62 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లు
- థర్డ్‌వేవ్‌పై అప్రమత్తంగా ఉండాలి
- మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: సాధారణ సృజనాత్మక ఆలోచనలు గ్రామీణ భారతం అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని ప్రధాని మోడీ అన్నారు. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో ఆదివారం మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. బీహార్‌లోని మధుబనిలో ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన ఓ పథకం గురించి ప్రస్తావించారు. దీనివల్ల రైతులు మాత్రమే కాకుండా పరిసర గ్రామాల్లో కాలుష్యం తొలగిందన్నారు. ఈ విశ్వవిద్యాలయానికి చెందిన, వాతావరణ మార్పులపై అధ్యయన కేంద్రం ఓ మంచి పథకాన్ని అమలు చేస్తున్నదని చెప్పారు. సుఖేత్ మోడల్ అని పిలుస్తున్న ఈ పథకం రైతులకు సహాయ పడటంతోపాటు సమీప గ్రామాలు కాలుష్య రహితమైనట్టు తెలిపారు. ఈ పథకంలో భాగంగా, పంట వ్యర్థాలు, ఆవు పేడ, వంట గదిలో వ్యర్థాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నుంచి సేకరిస్తారన్నారు. వీటిని ఇచ్చినవారికి వంట గ్యాస్ కొనుక్కోవడానికి డబ్బులు చెల్లిస్తున్నారన్నారు. ఆర్గానిక్ వ్యర్థాలను వర్మీ కంపోస్ట్‌గా మార్చుతున్నారని చెప్పారు. మొక్కలు, పంటలకు ఈ ఎరువు ఉపయోగపడుతుందన్నారు. సుఖేత్ పథకం వల్ల నాలుగు ప్రయోజనాలు ఉన్నాయన్నారు. గ్రామాలు కాలుష్యరహితం కావడం, ఇండ్లు పరిశుభ్రంగా ఉండటం, వంట గ్యాస్ కొనుక్కోవడానికి ప్రజలకు డబ్బు లభించడం, మెరుగైన రీతిలో సాగు చేయడానికి ఉపయోగపడే ఎరువులు రైతులకు లభించడం ఈ పథకం వల్ల కలుగుతున్న ప్రయోజనాలని వివరించారు. స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడిన ప్రతిసారీ ఆటోమేటిక్‌గా ఇండోర్ గుర్తుకొస్తుందని చెప్పారు. స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానంలో ఇండోర్ ఉందని తెలిపారు. అయితే ఇండోర్ ప్రజలు సంతృప్తి చెందలేదనీ, దేశంలో తొలి వాటర్ ప్లస్ నగరంగా ఇండోర్‌ను నిలిపారని అన్నారు. ఒలింపిక్స్‌లో మన దేశానికి పెద్ద సంఖ్యలో పతకాలు రాకపోయి ఉండవచ్చునని, నేటి యువత క్రీడలకు సంబంధించిన అవకాశాలను అన్వేషిస్తున్నారని చెప్పారు. ఈ వేగాన్ని ఆపలేమని చెప్పారు. ఈ వేగం అన్ని రంగాల్లోనూ శాశ్వతంగా ఉండేలా కృషి చేయాలన్నారు. నేటి యువత రొటీన్‌ను అనుసరించాలని అనుకోవడం లేదని చెప్పారు. తెలియని చోట్లకు వెళ్లాలని కోరుకుంటున్నారని, అక్కడ ఒకసారి నిలదొక్కుకుంటే, ఇక ఆపడం ఎవరి తరమూ కాదని చెప్పారు. కొంతకాలం కిందట అంతరిక్ష రంగానికి ద్వారాలు తెరిచామని, యువతరం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమైందన్నారు. దీంతో ప్రయివేట్ వ్యక్తులు ఉత్సాహంతో ముందుకు వచ్చారని తెలిపారు. రాబోయే రోజుల్లో యువత, విద్యార్థులు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలల్లో పనిచేసే విద్యార్థులు రూపొందించే కత్రిమ ఉపగ్రహాలు పెద్ద సంఖ్యలో ఉంటాయని తనకు విశ్వాసం ఉందన్నారు. చదువుకున్న కుటుంబంలో యువకులు స్టార్టప్‌ల వైపు వెళ్తామని అంటున్నారనీ, అంటే రిస్క్ తీసుకోవడానికి వారి మనస్సు ఉవ్విళ్లూరుతోందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచంలో బొమ్మల రంగానికి భారీ మార్కెట్ ఉందని, దాదాపు రూ. 6-7 లక్షల కోట్ల మార్కెట్ అని, అందులో భారతదేశ వాటా చాలా తక్కువని తెలిపారు. ప్రపంచ ప్రజలు ఈనాడు భారతీయ ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని అన్నారు. స్వాతంత్య్రానికి 75 ఏండ్లు కావస్తున్న ఈ ఏడాది మనం ప్రతిరోజూ కొత్త తీర్మానాలు చేసుకోవాలనీ, కొత్తగా ఆలోచించాలనీ, కొత్త విషయాలను సాధించేందుకు ప్రేరణ పొందాలని సూచించారు. స్వాతంత్య్రం సాధించి వందేండ్లు పూర్తి అయినప్పుడు, ఈ తీర్మానాలు మాత్రమే విజయానికి పునాదిగా కనిపిస్తాయని అన్నారు. దేశంలో 62 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లు అందజేశామని, అయినా థర్డ్‌వేవ్ గురించి ఇంకా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.