Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్లు దిగ్బంధం.. దిష్టి బొమ్మల దహనం
- పోలీస్ లాఠీచార్జిలో గాయపడి రైతు సుశీల్ కాజల్ మృతి
న్యూఢిల్లీ : హర్యానాలో రైతులపై పోలీసుల అమానవీయ చర్యలను ఖండిస్తూ దేశంలోని రైతాంగం ఆగ్రహం పెల్లుబికింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రోడ్ల దిగ్బంధం, దిష్టి బొమ్మల దహనం, మానవ హారాలు, క్యాండిల్ మార్చ్‌లు వంటి వివిధ రూపాల్లో నిరసనలు జరిగాయి. కర్నాల్‌లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బీజేపీ సమావేశానికి నిరసనగా రైతులు ఎన్‌హెచ్ -44 దిగ్బంధించారు. దీంతో బస్తారా టోల్ ప్లాజా వద్ద రైతులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ లాఠీచార్జిలో 12 మంది రైతులు గాయపడ్డారు. అందులో ఒక రైతు మరణించారు. రైతులపై పోలీసుల దాడిని ఖండిస్తూ దేశ వ్యాప్తంగా రైతులతో సహా ప్రజా సంఘాల కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. రైతులు తలలు పగిలేలా దాడి చేయాలనీ, రైతుల తలలు పగలడం తాను చూడాలని పోలీసులను ఆదేశించిన కర్నాల్ ఎస్డీఎం ఆయూష్ సిన్హాపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) చైర్మెన్ అరుణ్ కుమార్ మిశ్రాకి న్యాయవాదులు లేఖ రాశారు. అలాగే హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ క్షమాపణలు చెప్పాలనీ, రైతుల తలలను లాఠీలతో పగలగొట్టాలని ఆదేశించిన ఎస్డీఎం ఆయూష్ సిన్హాను తొలగించాలని యావత్ భారతావని డిమాండ్ చేసింది.
పోలీసు దుశ్చర్యను ఖండిస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. హర్యానా, పంజాబ్‌లో ఆందోళనలు మిన్నంటాయి. ప్రతి జిల్లా, ప్రతి మండలంలో కూడా ఆందోళనలు జరిగాయి. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో రహదారుల దిగ్బంధం జరిగింది. జాతీయ, రాష్ట్ర రహదారులను, టోల్‌ప్లాజాలను రైతులు, ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలు అడ్డుకున్నారు. పలు చోట్ల హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. పంజాబ్‌లో రైతు నిరసన వల్ల చాలా చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జలంధర్-పఠాన్‌కోట్ హైవే, లూథియానా-చండీగఢ్ హైవే, అమృత్సర్-గంగానగర్ హైవే, ఫిరోజ్‌పూర్-జిరా రహదారిపై తీవ్ర ప్రభావితానికి గురయ్యాయి. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. రైతులపై పోలీసు చర్య తరువాత హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ఆ పదవిలో కొనసాగే హక్కు లేనందని, నైతిక బాధ్యతతో ఆయన రాజీనామా చేయాలని రైతు నేతలు డిమాండ్ చేశారు.
పోలీసుల దాడిలో గాయపడి రైతు కన్నుమూత
హర్యానాలోని కర్నాల్‌లో శనివారం పోలీసు లాఠీ చార్జిలో తీవ్రంగా గాయపడిన 55 ఏండ్ల రైతు సుశీల్ కాజల్ మరణించారు. ఒకటిన్నర ఎకరాల భూమిని కలిగి ఉన్న సుశీల్ కాజల్ గత తొమ్మిది నెలలుగా రైతుల ఆందోళనలో పాల్గొంటున్నారు. రాంపూర్ జతన్ గ్రామానికి చెందిన సుశీల్, రైతు పోరాటంలో అతను మొదటి నుండి క్రమం తప్పకుండా పాల్గొన్నాడు. గత తొమ్మిది నెలలుగా అవిశ్రాంతంగా ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాడు. శనివారం కర్నాల్ టోల్ ప్లాజా వద్ద పోలీసుల రెచ్చిపోవటంతో.. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. రాత్రి అతను గుండెపోటుతో మరణించాడు. ఎలాంటి పోస్టుమార్టం చేయకుండానే ఈ ఉదయం 11 గంటలకు అతడికి అంత్యక్రియలు నిర్వహించారు. రైతు సంఘం ఆయన త్యాగాన్నిఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని ఎస్కేఎం నేత గుర్నామ్ సింగ్ చాదుని అన్నారు. అమరవీరుడు సశీల్ కాజల్ మరణానికి ఏఐకేఎస్ సంతాపం తెలిపింది. ఎస్డీఎంను తొలగించాలని పునరుద్ఘాటించింది. అలాగే ఆయన రాజకీయాలను బహిర్గతం చేయడానికి న్యాయ విచారణ జరపాలని ఏఐకేఎస్ డిమాండ్ చేసింది. ఆయనపై ఐపిసి 302 కింద హత్య కేసును నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ చారిత్రాత్మక రైతు పోరాటంలో గత తొమ్మిది నెలల్లో రెండు రాజద్రోహం కేసులతో సహా దాదాపు 40,000 మంది రైతులపై తప్పుడు పోలీసు కేసులు పెట్టి, తన సొంత ప్రజలపై యుద్ధం చేసిన హర్యానాలోని బీజేపీ-జేజేపీ ప్రభుత్వానికి సుశీల్ కాజల్ బాధితుడని ఎఐకెఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ దావలే, హన్నన్ మొల్లా అన్నారు.
సీఎం క్షమాపణ చెప్పాల్సిందే..మేఘాలయా గవర్నర్
కంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులకు మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ మరోసారి మద్దతు తెలిపారు. కర్నాల్‌లో లాఠీచార్జి చేసినందుకు హర్యానా సీఎం ఖట్టర్ క్షమాపణ చెప్పాలని అన్నారు. నిరసన తెలుపుతున్న రైతుల తలలను పగులగొట్టమని పోలీసులను ఆదేశించిన వీడియో బయటకు రావడంతో మాలిక్ ఆ ఐఎఎస్ అధికారిని తొలగించాలని డిమాండ్ చేశారు. ''హర్యానా ముఖ్యమంత్రి రైతులపై కర్రలు వాడుతున్నారు. బలప్రయోగం చేయొద్దని నేను అగ్ర నాయకత్వానికి చెప్పాను'' అని అన్నారు. ఎస్‌డిఎం ఆయూష్ సిన్హాను వెంటనే తొలగించాలని, ఆయన ఆ పదవికి సరిపోడని, ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాడని అన్నారు. నిరసనల సందర్భంగా మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి ఓదార్పు ఇవ్వలేదని మాలిక్ పేర్కొన్నారు. కాగా రైతులపై పోలీసుల అమానవీయంగా చేసిన లాఠీఛార్జ్‌ను ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమర్థించుకున్నారు. శాంతి భద్రతలను నిర్వహించడానికి పోలీసులు ప్రయత్నించారని అన్నారు.
నూహ్ లో మహా పంచాయితీ
హర్యానాలోని నూV్‌ాలో నిర్వహించిన కిసాన్ మహా పంచాయితీలో ఎస్‌కెఎం నేత దర్శన్ పాల్ సింగ్ మాట్లాడుతూ ఢిల్లీ రోడ్లను దిగ్బంధించేందుకు దక్షిణ హర్యానా-మేవాట్ రైతులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ మొత్తాన్ని దిగ్బంధించేందుకు సిద్ధంగా ఉండాలని, ఈ మేరకు ఎస్‌కెఎం త్వరలోనే పిలుపునిస్తుందని పేర్కొన్నారు. సెప్టెంబరు 5న ముజఫర్‌నగర్ మహా పంచాయత్‌లో 'మిషన్ యుపి'ని ప్రకటిస్తామన్నారు. రైతు నేత యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ సెప్టెంబరు 5 నాటి ముజఫర్‌నగర్ మహా పంచాయత్ దేశంలోని రైతులందరికీ పరీక్షలాంటిదన్నారు. మేవాట్ రైతులు ఉత్తరప్రదేశ్ చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని తాలిబన్ల గుప్పెట్లో దేశం: తికాయత్
రైతులపై హర్యానా పోలీసులు విచక్షణారహితంగా జరిపిన లాఱిచార్జీపై రైతు నేత రాకేశ్ తికాయత్ నిప్పులు చెరిగారు. హర్యానా ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని తాలిబన్ల గుప్పెట్లోకి దేశం వెళ్తున్నదనీ, ప్రభుత్వ తాలిబన్ కమాండర్ ప్రస్తుతం దేశంలోనే ఉన్నారనీ, ఈ కమాండర్లను గుర్తించాల్సి ఉందని వ్యాఖ్యానించారు.