Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్ 2, 3 నిర్మాణ కార్మికుల దేశవ్యాప్త సమ్మె
- అక్టోబర్ 10 నుంచి 21 వరకు డిమాండ్స్ డే
- నవంబర్ మొదటి వారంలో కేంద్ర, రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులకు వినతులు
- నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డుకు కేంద్ర నిధులు ఇవ్వాలి
- అంతర్రాష్ట్ర వలస కార్మికుల జీఎస్టీ తగ్గించాలి . సీడబ్ల్యూఎఫ్ఐ వర్కింగ్ కమిటీ నిర్ణయం
- సమ్మెను జయప్రదం చేయండి : సుకుభీర్ సింగ్, వి.శశికుమార్
న్యూఢిల్లీ: దేశంలోని నిర్మాణ రంగ కార్మికులు ఆందోళనలకు పిలుపు ఇచ్చారు. డిమాండ్ల సాధనకు డిసెంబర్ 2, 3 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెను నిర్వహించేందుకు నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో రెండు రోజుల పాటు జరిగిన కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీడబ్ల్యూఎఫ్ఐ) కేంద్ర వర్కింగ్ కమిటీ సమావేశం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్మాణ రంగంలోని కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను ప్రకటించింది. ''నిర్మాణ రంగాన్ని కాపాడాలనీ, అలాగే భవన, ఇతర నిర్మాణ కార్మికులు చట్టం-1996ను, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డుల చట్టం-1998ని పరిరక్షించాలి. నిర్మాణ రంగ కార్మికులకు పెన్షన్ ఇచ్చేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులకు నిధులు ఇవ్వాలి. అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979ను పరిరక్షించాలి. నిర్మాణ రంగ పరికరాలపై జీఎస్టీ తగ్గించాలనీ, అలాగే వాటి ధరలు తగ్గించాలి. నిర్మాణ రంగ కార్మికుల అఖిల భారత సలహా కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలి'' అని డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది.
అలాగే సమ్మెకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని నవంబర్ 15లోగా పూర్తి చేయాలని రాష్ట్ర కమిటీలకు సూచించింది. అక్టోబర్ 10 నుంచి 21 వరకు జాతీయ స్థాయి డిమాండ్స్ డే నిర్వహించాలని తెలిపింది. అక్టోబర్ 10న డిమాండ్స్ డే సందర్భంగా అన్ని రాష్ట్ర కమిటీలు, అనుబంధ సంఘాలు కలిపి కార్మికుల జనరల్ బాడీ సమావేశాలు, డిమాండ్స్‌తో కూడిన బ్యాడ్జీలు, పోస్టర్లు, వీధిల్లో సమావేశాలు మొదలైనవి నిర్వహించాలని సూచించింది. నవంబర్ మొదటి వారంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి, రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులకు డిమాండ్స్‌తో కూడిన వినతి పత్రాలు సమర్పించాలని తెలిపింది. వీటితో పాటు సంఘం బలోపేతానికి రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించాలని పేర్కొన్నది. ఈ ఏడాది చివరి నాటికి సిఐటియుతో సంప్రదించి జాతీయ స్థాయిలో రాజకీయ తరగతులు నిర్వహిస్తామనీ, అక్టోబర్, నవంబర్‌ల్లో రాష్ట్ర స్థాయిల్లో కూడా క్లాసులు నిర్వహించాలని పేర్కొంది. ఈ క్లాసుల్లో నిర్మాణ రంగ కార్మిక ఉద్యమం అవకాశాలు, సవాళ్లు, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌పై కార్మికులకు వివరించాలని సూచించింది. అన్ని రాష్ట్ర కమిటీలు, అనుబంధ సంఘాలు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రచారం చేయాలని తెలిపింది.
సమ్మెతో డిమాండ్లు సాధిద్దాం. సుకుభీర్ సింగ్, వి.శశికుమార్
డిసెంబర్లో జరిగే భవన నిర్మాణ రంగ కార్మికుల దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీడబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుకుభీర్ సింగ్, వి.శశికుమార్ కోరారు. ఎన్నో పోరాటాల ద్వారా కార్మికులు తమ హక్కులు సాధించుకుంటే, మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసిందని విమర్శించారు. బడా కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్లను తీసుకు వచ్చిందనీ, ఈ చట్టాల వల్ల కార్మిక శ్రమ దోపిడీ జరుగుతుందని పేర్కొన్నారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, వలస కార్మికుల చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మోడీ సర్కార్ కార్మిక వ్యతిరేక నిర్ణయాలతో నిర్మాణ రంగ కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోతారని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్మాణ రంగం సంక్షేమ బోర్డులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులంతా ఫెడరేషన్ ఇచ్చే పిలుపులో పాల్గొని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్మికులతో పాటు దేశంలో పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం ఢిల్లీ నడిబొడ్డు న జరుగుతున్నదన్నారు. మోడీ ప్రభుత్వం అంబానీ, అదానీలతో సహా స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేందుకు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు. మోడీ సర్కార్ ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందనీ, ''కిసాన్ మజ్దూర్ ఏక్ హై'' నినాదంతో మతతత్వ బీజేపీని తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. కేంద్ర వర్కింగ్ కమిటీ సమావేశానికి తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగూరి రాములు, రత్నాకరం కోటం రాజు, రాష్ట్ర కోశాధికారి ఎస్. రామ్మోహన్, రాష్ట్ర కార్యదర్శి అనంతగిరి రవి, చంద్రారెడ్డి, గోనెల రాములు, లక్ష్మయ్య ,ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింహారావు, బి. వెంకట్రావు, వి. పెద్దబాబు, హాజరయ్యారు.