Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ వనరుల్ని అమ్ముకుంటారా?
- 70ఏండ్ల సంపద..రైల్వే, విమానయానం, ఓడరేవులు
- ప్రజల పన్నులతో ఏర్పడిన ఆస్తులివి
- మోడీ సర్కార్ తీసుకొచ్చిన 'మానిటైజేషన్ పైప్‌లైన్' అత్యంత ప్రమాదకరం
- కార్పొరేట్లకు భారీ బొనాంజా : ఆర్థిక విశ్లేషకులు
- ఇది మరోరూపంలో ప్రయివేటీకరణ..
కేంద్రం నిరుద్యోగ సమస్యపై మాట్లాడటం లేదు. రైతులు, కార్మికుల నిరసనలపై స్పందించటం లేదు. రూ.వంద దాటిన పెట్రోల్, డీజిల్..ఇతర ధరలపై ఆలోచించటం లేదు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ముందు దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలెన్నో ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెట్టి..70ఏండ్ల దేశ సంపద, వనరుల్ని బడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి(నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్..పేరుతో) సిద్ధమైంది. ఆస్తుల నగదీకరణ కార్యక్రమం..దేశాన్ని అత్యంత ప్రమాదంలోకి నెడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ : ఇప్పుడు మనం చూస్తున్న రైల్వే వ్యవస్థ ఎన్నో దశాబ్దాల శ్రమ ఫలితం. దేశ ప్రజల పన్నులతో ఏర్పడిన సంపద. ఇది ఎన్నో కోట్లమందికి ఉపాధి ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుతోంది. ఒక్క రైల్వేనే కాదు...ఓడరేవులు, జాతీయ రహదారులు, టెలీకమ్యూనికేషన్లు, సహజవాయువు, విద్యుత్ ఉత్పత్తి, ఖనిజ తవ్వకాలు, గ్యాస్ పైప్లైన్లు..మొదలైనవి దేశ సంపద, వనరులు. వీటికి 'టు-లెట్' బోర్డులు తగిలించి మోడీ సర్కార్ గంప గుత్తగా సుదీర్ఘకాలం (25-30ఏండ్లు) లీజ్ ఇవ్వడానికి లేదా ప్రయివేటీకరణ చేయడానికి సిద్ధమైంది. ఈ అంశం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 'నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్' పేరుతో దేశ సంపదను కార్పొరేట్ల చేతుల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇది పక్కా మోసం..
ఆస్తుల ప్రయివేటీకరణ, లీజ్..పేర్లు వేరైనా రెండూ ఒకటేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వివిధ రంగాల్లో మోడీ సర్కార్ చేపట్టిన 'ప్రయివేటీకరణ' అనుకున్నట్టుగా సాగలేదు. దాంతో 'లీజ్' పేరుతో 'నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్' అనే కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ''అబ్బే..పూర్తిగా అమ్మేయటం లేదు..కొన్నేండ్లు లీజ్‌కు ఇస్తున్నాం''..అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెబుతోంది. ఆమె మాటల్ని ఎవరూ నమ్మటం లేదు. తాజా ప్రకటనతో దేశ విదేశాల్లోని నాలుగు లేదా ఐదు బడా కార్పొరేట్ సంస్థలు లాభపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదెలా అంటే..
జాతీయ రహదార్లు, రైల్వే స్టేషన్లు, సరుకు రవాణా, ఓడ రేవులు..ఇలా అన్నింటినీ కొన్ని దశాబ్దాలపాటు ప్రయివేటుకు ఇస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ఇందులో కాంట్రాక్ట్‌లు దక్కించుకునేది చిన్న, మధ్య తరగతి వ్యాపారులు కాదు. బడా కార్పొరేట్లు. కాంట్రాక్టులు దక్కించుకోవడానికి కార్పొరేట్ కంపెనీలకు బ్యాంకుల నుంచి భారీ రుణాలు కూడా అందుతాయని తెలుస్తోంది. అంటే ప్రజల డబ్బుతోనే ప్రజల సంపదను, వనరుల్ని కొట్టేస్తున్నారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది.
ప్రజలకు లాభం ఏముంది?
రైల్వేలు, ఓడరేవులు, జాతీయ రహదారులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సహజ వాయువు సంస్థలు..మొదలైనవి దేశ అభివృద్ధికి వెన్నెముకగా ఉన్నాయి. ప్రయివేటీకరణ తర్వాత కార్పొరేట్ సంస్థలు వాటిని పీల్చిపిప్పి చేసి..25-30ఏండ్ల తర్వాత వదిలేస్తాయని వారు చెప్పారు. ఆదాయ లోటును పూడ్చుకోవటం కోసం కేంద్రం ఈ 'మానిటైజేషన్ పైప్‌లైన్'ను ఎంచుకుందని, ప్రయివేటీకరణతో వచ్చిన డబ్బు ఏదీ తిరిగి ప్రజల కోసం ఖర్చు పెట్టరని అనుమానాలున్నాయి. ఉదా హ రణకు.. నేడు జాతీయ రహదార్లపై 'టోల్ వసూలు' ఏ తీరున ఉందో అందరికీ తెలుసు. జాతీయ రహదారిపై 150 కి.మీ దూరం ప్రయాణిస్తే..భారీ ఎత్తున టోల్ వసూలు చేయటం చూస్తూనే ఉన్నాం. ఇలాంటివే వివిధ రంగాల్లోనూ ప్రవేశపెట్టాలన్నదే మోడీ సర్కార్ వ్యూహమని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కడ ఎంతమొత్తం
26,700 కి.మీ జాతీయ రహదారులు రూ.1.6లక్షల కోట్లు
400రైల్వే స్టేషన్లు, 150 రైళ్లు రూ.1.5లక్షల కోట్లు
విద్యుత్ లైన్లు రూ.67వేల కోట్లు
జల, పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు రూ.32వేల కోట్లు
జాతీయ గ్యాస్పైప్లైన్లు రూ.24వేల కోట్లు
ఐఓసీ, హెచ్‌పీసీఎల్ పైప్లైన్లు రూ.22వేల కోట్లు
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ టవర్లు
భారత్ ఆప్టిక్ ఫైబర్ రూ.35వేల కోట్లు
21 విమానాశ్రయాలు, 31ఓడరేవులు రూ.30వేల కోట్లు
160కోల్ మైనింగ్ ప్రాజెక్టులు రూ.30వేలకోట్లు
వేర్ హౌసింగ్(గోడౌన్లు) రూ.29వేల కోట్లు
2 క్రీడా మైదానాలు రూ.11వేల కోట్లు
మొత్తం రూ.6లక్షల కోట్లు(సుమారుగా)