Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాద వ్యూహాలకూ అడ్డుకట్ట
- ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలి : కౌలురైతు సంఘం సెమినార్లో సాయినాథ్
గుంటూరు : కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులలో తొమ్మిది నెలలుగా మహోధృతంగా సాగుతున్న రైతు ఉద్యమం మార్కెట్ శక్తులకు, హిందూ మతోన్మాద వ్యూహాలకు ఏక కాలంలో గట్టి సవాల్ విసిరిందని ప్రముఖ జర్నలిస్టు పాల గుమ్మి సాయినాథ్అన్నారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న పోరాటం కేవలం వారి కోసమే కాదనీ, యావత్తు జాతి శ్రేయస్సు కోసం, స్వావలంబనకు, రాజ్యాంగ పరిరక్షణ కోసం అని చెప్పారు. రైతుల వీరోచిత పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలనీ, తద్వారా మోడీ ప్రభుత్వం చట్టాలను రద్దు చేసుకునేలా ఒత్తిడి చేయాలని పిలుపునిచ్చారు. 'రైతు వ్యతిరేక చట్టాలు-వ్యవసాయం-ప్రజలపై ప్రభావాలు' అంశంపై ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం (ఏపీకేఆర్ఎస్) ఆధ్వర్యాన రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సెమి నార్ను ఆదివారం సాయినాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీకేఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. సాయినాథ్ ప్రారంభోప న్యాసం చేస్తూ మూడు వ్యవసాయ చట్టాలూ రైతు వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, జాతి వ్యతిరేకమనీ, కార్పొరేట్ దోపిడీకి అనుకూలమని స్పష్టం చేశారు. 'హిమాచల్ ప్రదేశ్‌లో కిలో ఫైన్ క్వాలిటీ యాపిల్ ధర గత ఏడాది రూ.88 కాగా ఇప్పుడు అదానీ గ్రూపు రూ.72 రైతులకు చెల్లిస్తోంది. కార్పొ రేట్ దోపిడీకి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి' అని గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉండగా, కేంద్రం ఎలా చట్టాలు చేస్తుందని ప్రశ్నించారు. రైతులను, రాష్ట్రా లను ఎవ్వరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిరుడు జూన్‌లో ఆర్డినెన్స్లిచ్చారని, రైతులు నిరసనలు తెలిపినా పట్టించుకోలేదని అన్నారు.'సెప్టెంబర్‌లో పార్లమెంట్ ముందుకు బిల్లులు తెచ్చినప్పుడు సెలెక్టు కమిటీ, స్థాయిసంఘానికి నివేదించాలన్న ప్రతిపక్షాల అభ్యర్ధనను పట్టించుకోలేదు. నిరసనలను ఖాతరు చేయలేదు. రాజ్యసభలో మెజార్టీ సాధించేందుకు ఎనిమిది మంది ఎంపిలను బలవంతంగా బయటకు గెంటారు. అప్పటికీ మెజార్టీపై అనుమానం వచ్చి రాజ్యాంగ విరుద్ధంగా మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకున్నారు' అని చెప్పారు.
బ్రిటిష్ కాలం నాటి క్లాజులు
చట్టాల్లో బ్రిటిష్ కాలంనాటి క్లాజులు పెట్టారన్నారు సాయినాథ్. కాంట్రాక్టు సాగులో కార్పొరేట్ కంపెనీ అగ్రిమెంట్‌ను అతిక్రమించిన పక్షంలో రైతులు కోర్టులకెళ్లడానికి అవకాశం ఇవ్వకుండా, కేవలం కలెక్టర్, డిప్యూటి కలెక్టర్, తహసీల్దార్ వంటి అధికారులతో కూడిన అప్పిలేట్ అథారిటీ వద్దకు వెళ్లమన్నారనీ, పెద్ద పెద్ద కార్పొరేట్లపై ఈ అధికారులు చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. బీహార్‌లో వ్యవసాయ మార్కెట్ యార్డులను 2006లో ఎత్తేశాక దేశంలోనే అతి తక్కువ ధరలు అక్కడి రైతులకు వస్తున్నాయన్నారు. నిత్యావసర సరుకుల నిల్వపై పరిమితులు ఎత్తేసే చట్టం మరీ దుర్మార్గమన్నారు. మోడీ సర్కారు ఐదేళ్లల్లో రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామనగా, నాలుగున్నరేండ్లలో నామమాత్రం కూడా పెరగలేదనీ, పైగా దిగజారాయని వివరించారు. రైతుల ఆత్మహత్యలు ఆగట్లేదని, లెక్కల్లోనూ పారదర్శకత లేదని తెలిపారు.
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న పంజాబ్ రైతులు ధనవంతులని కార్పొరేట్ మీడియా పతాక శీర్షికల్లో రాసిందనీ, పంజాబ్ రైతుల ఆదాయం నెలకు కుటుంబానికి రూ.18,050 అని, ఏ సంఘటిత రంగంలో కార్మికునికీ ఇంత తక్కువ ఆదాయం ఉండదని పేర్కొన్నారు. కరోనా సమయంలో దేశ జీడీపీ 7.7 శాతం తగ్గగా 140 మంది శతకోటీశ్వరుల ఆదాయం 94శాతంపెరిగిందనీ, అసమానతలకు ఇదొక ఉదాహరణ అని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్నంత స్థాయి ప్రజాతంత్రయుత ఉద్యమం ఎప్పుడూ చూడలేదనీ, అయినా దేశ సరిహద్దులో కూడా లేనంతగా రైతులను నిలువరించేందుకు అడ్డుగోడలు నిర్మించారని, వాటర్ క్యానన్లు, లాఠీచార్జీలు వంటి ఘోర నిర్బంధం గురించి చెప్పనవసరం లేదని అన్నారు.
రద్దు చేసే వరకు వెనక్కి తగ్గం
రైతు సంఘాల సమన్వయ కమిటీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలపై చెప్పే నీతి వాక్యాలు పచ్చి అబద్ధాలన్నారు. అహంభావంతో రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, పార్లమెంట్‌ను తుంగలోతొక్కి వ్యవసాయ చట్టాలు తెచ్చిందని చెప్పారు.
మోడీ ప్రభుత్వం చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం నుండి వెనక్కి తగ్గేది లేదన్నారు. ఆహ్వానసంఘం అధ్యక్షులు, ఏపీ ఎంఎల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, కేరళ ఆ విధంగా కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు అవసరమైతే కోర్టులో సవాల్ చేస్తానందని, తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసిందని, ఏపీ ప్రభుత్వం సైతం తీర్మానం చేయాలని అన్నారు. కౌలు రైతుల సమస్యలపైనా, రైతు పోరాటానికి పీడీఎఫ్ మద్దతిస్తోందని చెప్పారు.