Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గత ఏడాది ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై పోలీసు విచారణ సరైన విధంగా లేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు విచారణ నాసిరకంగా ఉందని అడిషనల్ సెషన్స్ జడ్జ్ వినోద్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సగం సగం విషయాలతో ఛార్జ్‌షీట్‌ను నమోదుచేశారని, న్యాయపరమైన ముగింపు ఇవ్వాలన్న ఉద్దేశం పోలీసుల్లో కనపడటం లేదని ఆయన అన్నారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి 65వ బెటాలియన్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ద్వారా పోలీసులు అష్రఫ్ అలీ, పర్వేజ్ అనే ఇద్దర్ని నిందితులుగా కోర్టు ముంగిట హాజరుపర్చారు. వందలాది మందితో కూడిన గుంపు అల్లర్లకు తెగబడితే ఇద్దరు నిందితుల్ని కోర్టులో చూపుతున్నారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కేసులో విచారణ అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇద్దర్నీ పక్కకు తప్పించాలని ఈశాన్య ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌ను న్యాయస్థానం ఆదేశించింది. పోలీసు సిబ్బంది బాధితులుగా ఉన్న ఈ అల్లర్ల కేసులో విచారణ ఇంత దారుణంగా ఉందేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. కనీసం బాధితుల అభిప్రాయాలు కూడా సేకరించలేదని, వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరిపై ఆరోపణలు చేశారని, యధాలాపంగా కోర్టుకు ఛార్జ్‌షీట్ అందజేశారని కోర్టు పేర్కొంది.