Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పితోర్‌గఢ్‌లో కూలిన ఇండ్లు.. నలుగురు మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో పితోర్‌గఢ్‌లోని ధార్చుల సబ్ డివిజన్లో పలు ఇండ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గల్లంతయ్యారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ముగ్గురు చిన్నారులు సైతం ఉన్నారు. అదే ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా అనేక ఇండ్లు కూలిపోయియి. అక్కడి వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జాలీగ్రాంట్, రిషికేష్ మధ్య ఉన్న వంతేన సైతం కూలిపోయింది. దీంతో పాటు అనేక వంతేనలు నీటిలో కొట్టుకుపోయియి. ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర సహాయ బృందాలు సహాయ చర్యలను కొనసాగిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతంలోని ప్రజలను రక్షించడానికి హెలిప్యాడ్‌ను సైతం నిర్మిస్తున్నారు. ''ప్రభావిత గ్రామాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశాం. విపత్తు నిర్వహణ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి'' అని జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంది. కాగా, గత ఐదు రోజులుగా పితోర్‌గఢ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ..శనివారం నాడు నైనిటాల్, బాగేశ్వర్, పితోర్‌గఢ్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.