Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంయుక్త కిసాన్ మోర్చ్ తీవ్ర ఆగ్రహం
- హత్య కేసు నమోదు చేయాలి : హర్యానా ప్రభుత్వానికి ఎస్కేఎం అల్టిమేటం
న్యూఢిల్లీ : హర్యానాలో హంతక అధికారిని ముఖ్యమంత్రి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తీవ్ర ఆగ్రహం, అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఎస్డీఎం ఆయుష్ సిన్హాపై హత్య కేసు నమోదు చేయాలనీ, ఇందుకు సెప్టెంబర్ 6వ తేదీ వరకు గడువునిస్తున్నామని హర్యానా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఆగస్టు 28 కర్నాల్ జిల్లాలో జరిగిన క్రూరమైన లాఠీఛార్జ్‌లో తీవ్ర గాయాలపాలై రైతు సుశీల్ కాజల్ మరణించారు. రైతు ఉద్యమంలో అమరుని త్యాగాలను ఎస్కేఎం గౌరవిస్తుందని తెలిపింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై తీవ్ర హింసాత్మక చర్యలకు దిగిన ఎస్డీఎం, ఇతర అధికారులందరినీ తొలగించాలని డిమాండ్ చేసింది. రైతులపై పోలీసులు క్రూరంగా వ్యవహరించిన కర్నాల్‌లో సోమవారం భారీ కిసాన్ మహా పంచాయత్ జరిగింది. వేలాది రైతులు పాల్గొన్నారు. ఇందులో మహిళలు, యువకులు పెద్దసంఖ్యలో హాజరుకావటం విశేషం. ఎస్‌కెఎం నేత గుర్నామ్ సింగ్ చారుణి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటీవల రైతులపై లాఠీఛార్జి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో రైతుల ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలనీ, సెప్టెంబర్ 25న భారత్ బంద్ విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. మేఘాలయా గవర్నర్ సత్య పాల్ మాలిక్, ఇతర బీజేపీ నాయకులు ఆ అధికారిని వెంటనే తొలగించాలని కోరుతున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల చర్యలను సమర్థిస్తూ.. ఎస్డీఎం ఉపయోగించిన పదాలు మాత్రమే సరిగాలేవని అనడం ఆశ్యర్యంగా ఉందని ఎస్కేఎం విమర్శించింది. ఖట్టర్-చౌతాలా ప్రభుత్వం తన సొంత ప్రజలతో యుద్ధం చేస్తున్నదని ఆరోపించింది. కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నందున హర్యానా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని సీఎం అనడం దారుణమని విమర్శించింది. హర్యానా ప్రభుత్వం మొదటి నుంచి కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నదని తెలిపింది. బీజేపీ, దాని మిత్రపక్షాల నాయకులను రైతులందరు బహిష్కరించాలని ఎస్కేఎం పిలుపునిచ్చింది.
వంద మంది రైతులపై హర్యానా ప్రభుత్వం కేసులు
వంద మంది రైతులపై హర్యానా ప్రభుత్వం కేసులు పెట్టింది. దాడి చేసి, రైతులను తీవ్రంగా గాయపరిచి, తిరిగి రైతులపై కేసులు పెట్టడం సిగ్గుచేటని ఎస్కేఎం విమర్శించింది.ఈ కేసులను హర్యానా ప్రభుత్వం తక్షణమే, బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. యమునా నగర్లో బీజేపీ రైతుల ఆగ్రహాన్ని ఎదుర్కొనే భయంతో రెండు కార్యక్రమాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో రైతులు చేరుకోవడంతో హర్యానా విద్యా మంత్రి కన్వర్ పాల్ గుర్జార్, ఒక ఎమ్మెల్యే, యమునానగర్ మేయర్, బీజేపీ నాయకుడు సోనాలి ఫోగట్, ఎంపీ రతన్‌లాల్ కటారియా కార్యక్రమాన్ని పార్టీ రద్దు చేసుకున్నారు.