Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదిమందికి గాయాలు
- ఏపీలో వివాహ నిశ్చితార్థానికి వెళ్ళి వస్తుండగా ఘటన
ఒంగోలు : వివాహ నిశ్చయ కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకున్నారు. అందరూ కలిసి పప్పు అన్నం తిని తిరుగు ప్రయాణమయ్యారు. గమ్యస్థానం చేరేలోగా ప్రమాదం ముంచుకురావడంతో వారిలో ఐదుగురు దుర్మరణం చెందారు. పది మంది గాయపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలు-కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం... దర్శి క్రిస్టియన్‌పాలేనికి చెందిన యువకుడికి బేస్తవారిపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వివాహ నిశ్చతార్థం జరిపేందుకు వరుడు తరుఫువారు 15 మంది టాటా మ్యాజిక్ వాహనంలో కొత్తపేటలోని వధువు ఇంటికి ఆదివారం వెళ్లారు. వివాహ నిశ్చతార్థ కార్యక్రమం అనంతరం అర్ధరాత్రి వారు తిరుగు ప్రయాణమయ్యారు.
తర్లుబాడు మండలం రోలుగుంపాడు ఎస్టి కాలనీ సమీపంలో సోమవారం తెల్లవా రు జామున గుర్తు తెలియని వాహనం ఢ కొనడంతో రోడ్డుపై ఒక గేదె మృతదేహం అప్పటికే పడి ఉంది. దగ్గరకు వచ్చే వరకూ టాటా మ్యాజిక్ వాహనం డ్రైవర్ ఈ గేదెను గమనించలేదు. అతి సమీపంలోకి వచ్చాక గేదెను చూసి దాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢకొీట్టాడు. దీంతో, టాటా మ్యాజిక్ వాహనంలోని పొట్లపాటి శారమ్మ (34), గొంగటి మార్తమ్మ (45), ఇత్తడి లింగమ్మ (50), వాహన డ్రైవర్ వెంకటేశ్వర్‌రెడ్డి (33) అక్కడికక్కడే మృతి చెందారు. మక్కెన కోటమ్మ (55) కంభం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ప్రమాదంలో గాయపడిన పదిమందిని మార్కాపురం వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.