Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీబీ నుంచి రెండుసార్లు నోటీసులు..
- విచారణ నుంచి తప్పించుకోవడానికి లక్నో..ఢిల్లీ పారిపోయాడని వార్తలు
- రాజస్థాన్‌లో సంచలనం సృష్టిస్తోన్న భారీ అవినీతి కుంభకోణం
న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో ఒక అవినీతి బాగోతం సం చలనం సృష్టిస్తోంది. రాష్ట్రానికి చెందిన ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుడు నింబారాం, మరికొంత మంది బీజేపీ నాయకులు ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఏసీబీ విచారణను తప్పించుకునేందుకు వారు ఢిల్లీ లేదా లక్నోకు పారిపోయారని వార్తలు వెలువడ్డాయి. అవినీతి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నింబారాం ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్లగా, అక్కడ ఆయన లేకపోవటంతో నోటీసులు జారీచేయ లేకపోయారు. ఏసీబీ విచారణకు హాజరుకావాలని అధికారులు తెలియజేసినా..ఇప్పటివరకూ ఆయన ఏసీబీ ముందు హాజరుకాకపోవటం సంచలనంగా మారింది. దాంతో నింబారాంను అరెస్టు చేయాల్సిందిగా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.అవినీతి బాగోతంలో అడ్డంగా దొరికిపోయినా...తాను అన్నింటికీ అతీతుడనంటూ ఆర్ఎస్ఎస్ నాయకుడు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదని స్థానిక మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి..జైపూర్‌లో ఇంటింటికీ తిరిగి చెత్తాచెదారం, వ్యర్థాలు సేకరించే పనులకు సంబంధించి జైపూర్ మున్సిపాల్టీ కార్పొరేషన్ నుంచి బీవీజీ అనే సంస్థకు రూ.276కోట్లు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది. వీటిని క్లియర్ చేసి చెల్లింపులు జరగాలంటే తనకు 10శాతం కమిషన్(సుమారుగా రూ. 27కోట్లు) ఇవ్వాల్సిందిగా ఆర్ఎస్ఎస్ నాయకుడు నింబారం బీవీజీ సంస్థతో బేరసారాలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. స్థానిక బీజేపీ నాయకురాలు సౌమ్యా గుర్జర్ భర్త రాజారాం గుర్జర్ కూడా వీడియోలో కనిపించారు. నింబారం, రాజారాం గుర్జర్ ఇద్దరూ బీవీజీ సంస్థ ప్రతినిధి ఓంకార్ సప్రేతో మాట్లాడిన మాటలు ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి. రూ.276కోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్ కావాలంటే తమకు 10శాతం కమిషన్ ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేయటం వీడియోలో స్పష్టంగా కనపడింది.సంచలనం సృష్టించిన ఈ వీడియో ఆధారంగా ఆ రాష్ట్ర ఏసీబీ కేసు నమోదుచేసింది. ఈ కేసుతో సంబంధమున్న గుర్జర్, సప్రేలను ఏసీబీ అరెస్టు చేసింది. ఆర్ఎస్ఎస్ నాయకుడు నింబారం, మరొకరిని నిందితులుగా పేర్కొంది. అవినీతి కేసులో వీరి పాత్రపై విచారణ జరిపే నిమిత్తం ఏసీబీ వారికి నోటీసులు జారీచేసింది. రెండుమార్లు నింబారాంకు నోటీసులు జారీచేశారు. అయినా అతడి నుండి ఎలాంటి స్పందనా రాలేదని, విచారణకు హాజరుకాలేదని ఏసీబీ అధికారులు తెలిపారు. మూడో నోటీసు తర్వాతా హాజరుకాకపోతే, కోర్టు వారెంట్ తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాక, సంబంధిత వీడియో క్లిప్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిసింది. ఈ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చాక రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నింబారాంను వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.