Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 200 రోజులు అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
- విశాఖలో మానవహారం, కాగడాల ప్రదర్శన
విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు 200 రోజులు పూర్తయిన సందర్భంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం వెల్లువెత్తింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యాన ఆందోళనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వం రంగంలోనే కొనసాగించాలని నినాదాలు చేశారు. సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన విశాఖలోని పెదగంట్యాడ గాంధీ విగ్రహం దగ్గర నుండి నడుపూరు గాంధీ విగ్రహం వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రారంభించారు. ఆరు కోట్ల తెలుగు ప్రజల గుండె చప్పుడు విశాఖ ఉక్కు అని, దీనిని ప్రైవేటుపరం కానివ్వబోమని, ప్రాణాలకు తెగించైనా కాపాడుకుంటామని పెద్ద పెట్టున నినదించారు. స్టీల్‌ప్లాంట్ నిర్వాసితులు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, పోరాట కమిటీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ, టీడీపీ, సీపీఐ(ఎం), సీపీఐ, జనసేన నాయకులు మద్దతు తెలిపారు. కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరామ్, చైర్మన్లు మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యాన విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ జంక్షన్ వద్ద వందలాది మందితో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఎసి చైర్మన్ ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం ఆపకుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు.