Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనింగ్‌పై మోడీ సర్కారు పెత్తనం
- పైసా ఖర్చు చేయవద్దని రాష్ట్రాలకు ఆదేశం
న్యూఢిల్లీ : దేశంలోని మైనింగ్ కార్యకలాపాల కారణంగా ప్రభావితమయ్యే ప్రజలు, కమ్యూనిటీల కోసం వెచ్చించాల్సిన రూ. 25 వేల కోట్లకు పైగా నిధులపై మోడీ ప్రభుత్వం ప్రత్యక్ష నియంత్రణను చేపట్టింది. జూలై 12న జారీ చేసిన ఒక ఉత్తర్వులో.. మైనింగ్ లీజుదారుల నుంచి రాయల్టీలో కొంత శాతంగా సేకరించిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ (డీఎంఎఫ్ లు) నిధుల నుంచి పైసా ఖర్చు చేయవద్దని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
గత ఐదేండ్లకు పైగా దేశంలోని 600 జిల్లాల్లోని డీఎంఎఫ్లు మైనర్, ప్రధాన ఖనిజాల మైనింగ్ లీజుదారుల నుంచి రూ. 50,499.57 కోట్ల సేకరణ జరిగింది. అయితే, కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ సేకరించిన సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాలు తాము చేపట్టిన వివిధ ప్రాజెక్టుల కోసం జూన్ 2021 వరకు ఈ నిధుల నుంచి ఇప్పటికే రూ. 24,499.76 కోట్లు ఖర్చు చేశాయి. ఇప్పుడు, మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వు డీఎంఎఫ్‌ల వద్ద అందుబాటులో ఉన్న మిగిలిన నిధుల వినియోగంపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేసింది. '' డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్ర స్థాయి ఏజెన్సీ ద్వారా ఎలాంటి ఖర్చులకూ అనుమతి చేయరాదు'' అని మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వులో పేర్కొన్నది. '' రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా మినరల్ ఫండ్ల నుంచి నిధులను సంబంధిత జిల్లాల్లో మైనింగ్‌తో బాధపడుతున్న వారి ప్రయోజనాల కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం మళ్లించడం సరికాదు. అలాంటి సందర్భాలు తక్కువగా ఉంటే, నిధుల నుంచి వ్యయాలను మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాన్ని తగ్గించడానికి అధికారాలను ప్రేరేపించడం కంటే కేంద్రం.. వ్యక్తిగత కేసులతో వ్యవహరించాలి. ఇది సమాఖ్య వాదాన్ని నాశనం చేస్తుంది '' అని రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఈఏఎస్ శర్మ తెలిపారు.
బీజేపీ పాలనలో అవినీతి
డీఎంఎఫ్ వినియోగంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు నివేదికలు ఉన్నాయి. 2019లో ఛత్తీస్‌గఢ్ గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించిన విచారణలో కోర్బా జిల్లాలో డీఎంఎఫ్ నిధులతో చేపట్టిన పనులలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు వెల్లడైంది. 2016-17లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ అక్రమాలు ఎక్కువగా చోటుచేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా, మైనింగ్ ప్రభావిత ప్రజల సంక్షేమం కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం డీఎంఎఫ్ నిధుల వినియోగం జరగడం దారుణమని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, గతేడాది మార్చిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో.. మహమ్మారిని ఎదుర్కోవడానికి డీఎంఎఫ్ నిధుల నుంచి డబ్బు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు వెళ్లడం గమనార్హం.