Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోయిడాలోని 40 ఆంతస్తుల జంట భవంతులను
- కూల్చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సూపర్‌టెక్ సంస్థకు చెందిన 40 అంతస్తులతో కూడిన రెండు భారీ భవంతులను కూల్చివేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ సందర్భంగా జస్టిస్ డివై.చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టాలను సక్రమంగా పాటించేలా చూసేందుకు అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇంతటి భారీ భవనాలు పట్టణ ప్రణాళికలో చాలా కీలకమని, ఇలాంటి విషయాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగితే అది పర్యావరణానికి హాని చేయడంతో పాటు భద్రతా ప్రమాణాలను పలుచన చేస్తుందని పేర్కొంది. అదేవిధంగా భవన నిర్మాణ అనుమతుల విషయంలో సూపర్‌టెక్ సంస్థతో కుమ్మక్కైన సంబంధిత నోయిడా అధికారులపై విచారణ చేయాలని యుపి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. నిబంధనలకు విరుద్ధంగా సూపర్‌టెక్ సంస్థ నోయిడాలో 40 అంతస్తులతో 2 టవర్లు నిర్మించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మూడు నెలల్లోపు కూల్చివేతలు పూర్తిచేయాలని.. దానికయ్యే ఖర్చునూ సూపర్‌టెక్ సంస్థ నుంచే వసూలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు టవర్లలో దాదాపు వెయ్యి ప్లాట్లు ఉండగా.. ప్లాట్లు కొన్న వారందరికీ 12 శాతం వడ్డీతో నగదు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.పర్యావరణ భద్రత, నివాసితుల సంక్షేమంపై ఏమాత్రం ఆందోళన లేకుండా దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో భవన నిర్మాణాలకు సంబంధించి అధికారులు, బిల్డర్లు కుమ్మక్కును సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా అనధికార నిర్మాణాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని పేర్కొంది. పెద్ద నగరాల్లో హౌసింగ్ అవసరాలను పర్యావరణ పరిరక్షణ, పౌరుల సంక్షేమాన్ని సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందని చంద్రచూడ్ ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. భవన నిర్మాణ ప్రారంభ దశ నుంచి ముగింపు వరకు ప్రతి ప్రక్రియ చట్టపరిధికి లోబడి జరగాలని పేర్కొంది. సూపర్‌టెక్ భవనాలకు సంబంధించిన సమాచారాన్ని నివాసితులతో పంచుకోవడానికి బిల్డర్లు, అధికారులు నిరాకరించారని, ఇటువంటి సమయంలో సమాచారం సేకరించేందుకు ది రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ఆర్డబ్ల్యుఎ) ప్రయత్నాలను తొక్కిపెట్టారని పేర్కొంది. నోయిడాలో ఈ రెండు టవర్ల నిర్మాణానికి సంబంధించి 2009లో ఇచ్చిన అనుమతులు నేషనల్ బిల్డింగ్ కోడ్‌తో పాటు అగ్నిభద్రతా నిబంధనలు, ఉత్తరప్రదేశ్ అపార్ట్మెంట్ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాయని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.