Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాశ్వత సభ్య దేశాల మధ్య విభేదాలు?
న్యూఢిల్లీ : అంతర్జాతీయ తీవ్రవాదాన్ని నివారించేందుకు ఇచ్చిన హామీకి తాలిబన్లు కట్టుబడి వుండాలని గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం ఆమోదించింది. ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై ఎలాంటి తీవ్రవాద కార్యకలాపాలను అనుమతించరాదని కోరింది. ఐక్యరాజ్య సమితికి, దాని అనుబంధ సంస్థలకు, భాగస్వాములకు సురక్షితమైన, ఎలాంటి అడ్డంకులు లేని రీతిలో దేశంలోకి ప్రవేశాన్ని అనుమతించాలని తీర్మానం కోరింది. అవసరంలో వున్న వారందరికీ మానవతా సాయం అందేలా చర్యలు తీసుకోవడానికి వీలు కల్పించాలని కోరింది. భారత్ అధ్యక్షతన సోమవారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో 2593వ నెంబరు తీర్మానాన్ని చర్చించి ఆమోదించారు. ఆఫ్ఘనిస్తాన్పై భారతదేశానికి గల ప్రధాన ఆందోళనలు ఈ తీర్మానంలో ఈసారి వ్యక్తమయ్యాయని సంబంధిత వర్గాలుల మంగళవారం తెలిపాయి. కాగా ఈ తీర్మానంపై శాశ్వత సభ్య దేశాల మధ్య విభేదాలు పొడసూపాయి. శాశ్వత సభ్య దేశాల నుండి ఏకాభిప్రాయ తోడ్పాటును పొందడంలో తీర్మానం విఫలమైంది. తీర్మానంపై ఓటింగ్ సమయంలో చైనా, రష్యా గైర్హాజరయ్యాయి. రష్యా ప్రతినిధి మాట్లాడుతూ, ఈ ముసాయిదా తీర్మానం రూపకర్త అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదులను ''మనయొక్క , వారియొక్క'' గా విభజించిందని అన్నారు. అంటే ఇది, తాలిబన్లు, హక్కాని నెట్వర్క్ పట్ల అమెరికా వైఖరిలో మార్పును సూచిస్తోందని అన్నారు. కాగా భద్రతా మండలి సమావేశంలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్ శ్రింగాలా మాట్లాడుతూ, లష్కరే, జైషే మహ్మద్ గ్రూపుల పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సంస్థల కార్యకలాపాలను ఖండించాలని కోరారు. అయితే ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి, అన్ని పక్షాల నుండి ఉన్నత స్థాయి అధికారులను సంప్రదించడానికి భారత దౌత్య బృందం ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ ఏకాభిప్రాయం అవశ్యం బ్రిటన్
ఆఫ్ఘనిస్తాన్లోని కొత్త ప్రభుత్వంతో ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం వుండాలని బ్రిటన్ కోరుతోంది. దేశాన్ని వీడి వెళ్ళాలనుకునే ఆఫ్ఘన్లుల, విదేశీయులను సురక్షితంగా వెళ్ళేందుకు అనుమతించేలా తాలిబన్లు హామీ ఇవ్వాలని కోరుతోంది. శనివారంతో బ్రిటన్ తన బలగాల ఉపసంహరణను పూర్తి చేసింది. అయితే బ్రిటన్కు రావడానికి ఇంకా ఎంతమంది అర్హులనే విషయం స్పష్టం కాలేదు. కాగా, సురక్షితంగా ప్రజలు దేశం వీడి వెళ్ళడానికి తాలిబన్లు హామీ ఇచ్చారని ఆదివారం బ్రిటన్ సహా 90కి పైగా దేశాలు, సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఆఫ్ఘనిస్తాన్లో కొత్త ప్రభుత్వానికి సంబంధించి తీసుకునే ఏ నిర్ణయమైనా అంతర్జాతీయ భాగస్వాములతో ఒప్పందం చేసుకున్నదిగా వుండాలని బ్రిటన్ అభిప్రాయపడింది. తాలిబన్లు తీసుకునే చర్యలను బట్టి వారిని సమీక్షించడం వుంటుందని విదేశాంగ మంత్రి జేమ్స్ క్లేవర్లీ చెప్పారు. తాలిబన్లు ప్రభుత్వం మాదిరిగా వ్యవహరిస్తే ఆ ప్రాతిపదికనే తాము కూడా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.