Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన కలెక్టరేట్ ముట్టడి
- 11 మంది అరెస్టు
విజయనగరం : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన విజయనగరం కలెక్టరేట్ ముట్టడి పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. విద్యార్థులను, విద్యార్థి నాయకులను పిడిగుద్దులు గుద్దారు. కాళ్లతో తన్నారు. పలువురు విద్యార్థి నాయకులను ఈడ్చుకుంటూ తీసుకుపోయి అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎయిడెడ్ విద్యా సంస్థలను పరిరక్షించాలని, బకాయి ఉన్న విద్యావసతి, విద్యా దీవెన నిధులు విడుదల చేయాలని తదితర డిమాండ్లతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన విద్యార్థులు విజయనగరం తోటపాలెంలోని ఎల్బిజి భవనం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యలు విని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్లోకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, కలెక్టరేట్ ఎదురుగా జాతీయ రహదారిపై విద్యార్థులు బైటాయించి ఆందోళన కొనసాగించారు.
వారిపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎలా పడితే అలా విద్యార్థులను ఈడ్చేశారు. విద్యార్థుల చొక్కాలను చింపేశారు. పిడిగుద్దులు గుద్ది, కాళ్లతో తన్ని బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. విద్యార్థులను లాకెళ్లినప్పుడు వారి చేతులను పోలీసులు నులిపేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు రాము, రామకృష్ణ, హర్ష, సతీష్ తదితర నాయకుల పట్ల మరింత కర్కశంగా వ్యవహరించారు. మొత్తం 11 మంది నాయకులను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారికి మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టలేదు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ వారిపై కేసు పెట్టి స్టేషన్ బెయిలు ఇచ్చి సాయంత్రం విడుదల చేశారు.