Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజధాని లక్నోకు చేరుకున్న వేలాదిమంది కాంట్రాక్ట్ కార్మికులు
- ఆందోళనబాట పట్టిన టెక్నికల్ అసిస్టెంట్స్, అకౌంటెంట్స్, రోజ్‌గార్ సేవక్స్..
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో 'ఉపాధి హామీ'(నరేగా) పథకాన్ని అమలుజేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనబాట పట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని రెగ్యులరైజ్ చేయాలని, వేతనాల్ని పెంచాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని లక్నోలో నేటి నుంచి 'సత్యాగ్రహ' ఉద్యమాన్ని చేపడుతున్నట్టు కార్మికులు ప్రకటించారు. ఇందులో పాల్గొనడానికి వేలాదిమంది 'ఉపాధి హామీ' కార్మికులు, ఉద్యోగులు లక్నోకు తరలివచ్చారు. రాష్ట్రంలో 'మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లారుమెంట్ గ్యారెంటీ యాక్ట్'(నరేగా)లో దాదాపు 45వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్స్, అకౌంటెంట్స్, గ్రామ్ రోజ్‌గార్ సేవక్స్, అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్..మొదలైనవారు తమ నెలవారీ వేతనాల్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
'ఉపాధి హామీ' కాంట్రాక్ట్ కార్మికుడు సుమన్ మాట్లాడుతూ..''వేతనాల పెంపు, ఇతర డిమాండ్లపై మా పోరాటం మొదలైంది. మా డిమాండ్లు నెరవేర్చుకోవడానికి లక్నోలో ఎంతకాలమైనా ఉద్యమం చేస్తాం. ఆగస్టు 18నుంచి మా ఆందోళనలు మొదలయ్యాయి. ఇంతవరకూ మా గోడును సీఎం ఆదిత్యనాథ్ వినలేదు. దాంతో మా ఉద్యమం ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నాం. లక్నో నగరాన్ని చుట్టుముట్టి నేడు పెద్ద ఎత్తున నిరసనలు చేపడతా''మని చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం రూ.6వేలు పెంచాలని, పిల్లల స్కూల్ ఫీజులు, కుటుంబ ఖర్చులకు ఇది ఏమాత్రమూ సరిపోదు. అంతేగాక ఈ గౌరవవేతనం ఏనాడూ సమయానికి ఇవ్వటం లేదు..అని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు.
అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న పర్వేశ్ మాట్లాడుతూ..''నరేగా పథకంలో కాంట్రాక్ట్ కార్మికులుగా ఈ రాష్ట్రంలో వేలాది మంది పనిచేస్తున్నారు. నేడు వీరి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. గత నాలుగేండ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. రాష్ట్ర ప్రభుత్వం మా గోడు వినటం లేదు. కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది'' అని చెప్పారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కార్మికులంతా నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారని ఎంప్లారుమెంట్ గ్యారెంటీ కౌన్సిల్ మాజీ సభ్యుడు సంజరు దీక్షిత్ చెప్పారు.