Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ త్రైమాసికం గణంకాల వెల్లడి
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 20.1 శాతం పెరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. 2011-12 స్థిర ధరల వద్ద గడిచిన క్యూ1లో జీడీపీ 32.38 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర గణంకాల శాఖ అంచనా వేసింది. 2020-21లో ఇదే త్రైమాసికంలో రూ.26.95 లక్షల కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో భారత జీడీపీ ఏకంగా మైనస్ 24.4 శాతం క్షీణించింది. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మాంద్యానికి తోడు గతేడాది కరోనా నిబంధనలు, లాక్డౌన్ దెబ్బకు జీడీపీ భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. గతేడాది జూన్ త్రైమాసికంలో అత్యంత పేలవమైన గణంకాలతో పోల్చితే గడిచిన క్యూ1లో జీడీపీ భారీగా పెరిగినట్టు కనబడింది. అన్ని రంగాలు పుంజుకున్నాయని గణంకాల శాఖ పేర్కొంది. రిటైల్, వాహన అమ్మకాలు, వ్యవసాయం, నిర్మాణం, ఎగుమతుల రంగాలు మెరుగైన ఉత్పత్తిని కనబర్చాయి. కార్మికుల భాగస్వామ్యం పెరిగిందని తెలిపింది. మరోవైపు ఈక్విటీ మార్కెట్లు రికార్డ్ లాభాలను నమోదు చేయడం జిడిపి గణంకాలకు కలిసి వచ్చింది.
1990 తర్వాత ఇదే అత్యధిక వృద్ధి రేటు అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతక్రితం మార్చితో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ 1.6 శాతం పెరిగింది. క్రితం క్యూ1లో జీడీపీ 21.4 శాతం పెరుగొచ్చని తొలుత ఆర్బీఐ అంచనా వేసింది. దీంతో పోల్చితే స్వల్పంగా తగ్గింది. 2021-22 జూన్ త్రైమాసికంలో తయారీ రంగం 49.6 శాతం పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది 36 శాతం క్షీణించింది. ఇదే సమయంలో వ్యవసాయ రంగం 3.5 శాతం పెరగ్గా.. గడిచిన క్యూ1లో 4.5 శాతం ప్రగతిని కనబర్చింది. నిర్మాణ రంగం గతేడాది 49.3 శాతం క్షీణత నుంచి క్రితం క్యూ1లో 68.3 శాతం పెరిగింది. విద్యుత్, నీటి సరఫరా ఇతర సేవలు 14.3 శాతం పెరిగాయి. వాణిజ్యం, హోటళ్లు, రవాణ, కమ్యూనికేషన్, సేవల రంగాలు గతేడాది క్యూ1లో 48.1 శాతం క్షీణించగా.. గడిచిన త్రైమాసికంలో 34.3 శాతం పెరిగింది.
రాణించిన కీలక రంగాలు..
ప్రస్తుత ఏడాది జులైలో కీలక రంగాలు 9.6 శాతం వృద్ధి కనబర్చాయి. గతేడాది ఇదే మాసంలో ఈ ఎనిమిది ప్రాధాన్యత రంగాలు 7.6 శాతం పతనాన్ని చవి చూశాయి. గడిచిన జులైలో ముఖ్యంగా బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ పరిశ్రమల ఉత్పత్తి పెరిగిందని పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య శాఖ గణంకాలు తెలిపాయి. మరోవైపు ముడి చమురు ఉత్పత్తి 3.2 శాతం తగ్గిందని పేర్కొంది. గతేడాది జులైలో కోవిడ్ నిబంధనలు, లాక్‌డౌన్‌తో ఈ కీలక రంగాలు ఏకంగా మైనస్ 7.6 శాతం పతనాన్ని చవి చూశాయి. 2021 ఏప్రిల్ నుంచి జులై కాలంలో ఈ రంగాలు 21.2 శాతం పెరిగాయి.