Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ జైలుకు పంపొద్దు : 'పెన్' ఇంటర్నేషనల్
న్యూఢిల్లీ : ప్రముఖ కవి, పౌర హక్కుల కార్యకర్త వరవరరావుకు స్వేచ్ఛ కల్పించాలని, ఆయనపైన ఉన్న పలు కేసుల్ని ఎత్తేయాలని 'పెన్ ఇంటర్నేషనల్' భారత ప్రభుత్వాన్ని కోరింది. బీమా కోరేగావ్ కేసులో 2018లో అరెస్టు అయిన తర్వాత వరవరరావు(81) ఆరోగ్య పరిస్థితి దారుణంగా దెబ్బతిన్నదని, బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో కొంత ఉపశమనం లభించినా..వరవరరావును మళ్లీ జైలుకు పంపే అవకాశముందని 'పెన్ ఇంటర్నేషనల్' ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాక బెయిల్ మంజూరుచేస్తూ ఆయనపై విధించిన అనేక నిబంధనలు కూడా తమను ఆందోళనకు గురిచేశాయని, ముంబయిలో ఎక్కడికీ వెళ్లరాదని, ఎవరితోనూ మాట్లాడరాదని, ముఖ్యంగా మీడియాతో మాట్లాడరాదని వరవరరావుపై ఆంక్షలు విధించటాన్ని 'పెన్ ఇంటర్నేషనల్' ఖండించింది.
మానవతావాది, సామాజిక కార్యకర్త స్టాన్స్వామికి జైలులో ఎదురైన పరిస్థితి వరవరరావుకు రాకూడదని కోరుకుంటున్నామని 'పెన్' తెలిపింది. తప్పుడు కేసుల్లో ఆయన్ని ఇరికించారని, కుట్రపూరితమైన ఆరోపణలు ఆయనపై నమోదుచేశారని, వీటన్నింటినీ రద్దుచేసి..వరవరరావుకు స్వేచ్ఛను ప్రసాదించాలని 'పెన్ ఇంటర్నేషనల్' భారత ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం వరవరరావు మధ్యంతర బెయిల్పై ఉన్నారు. సెప్టెంబరు 10తో దీని గడువు ముగియనున్నది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100దేశాల్లోని కవులు, రచయితులతో ఏర్పడిన సంఘం 'పెన్ ఇంటర్నేషనల్'. లండన్ కేంద్రంగా గల ఈ సంస్థ వివిధ దేశాల్లోని రచయితలు, కవుల మధ్య స్నేహాన్ని, సహకారాన్ని పెంచే ఉద్దేశంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది.