Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వనరుల నుంచి రూ.3,377 కోట్ల మేర నిధులు
- వాటిల్లో బీజేపీకే 78 శాతం
- ఏడీఆర్ తాజా నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) తన తాజా నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. 2019-20 సంవత్సరానికి సంబంధించి పార్టీలకు ఎక్కడి నుంచి వచ్చాయో ఎటువంటి వివరాలు లేకుండా (గుర్తుతెలియని వ్యక్తులు, వనరులు) రూ.3,377.41 కోట్ల మేర విరాళాలు వచ్చాయని, అవి ఆయా పార్టీలకు వచ్చిన మొత్తంలో మెజార్టీగా 70.98 శాతంగా ఉన్నాయని పేర్కొంది. గుర్తుతెలియని వనరుల నుంచి తాము రూ.2,642.63 కోట్ల విరాళాలు పొందామని బీజేపీ ప్రకటించిందని ఏడీఆర్ తెలిపింది. ఈ విధంగా వచ్చిన నిధుల్లో ఇతర పార్టీలతో పోల్చుకుంటే బీజేపీకే అధికంగా 78.24 శాతం మేర ఉంది. ఇక కాంగ్రెస్‌కు ఈ రూపంలో రూ.526 కోట్లు (15.57 శాతం) విరాళాలు వచ్చాయని నివేదిక వెల్లడించింది. రూ.3,371.41 కోట్ల విరాళాల్లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.2,993.82 కోట్లు రాగా, ఇది 88.64 శాతంగా ఉంది. 2004-05, 2019-20 మధ్య కాలంలో ఇలా గుర్తుతెలియని వనరుల నుంచి పార్టీలు రూ.14,651 కోట్ల విరాళాలు సేకరించాయని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేలకు పైన ఇచ్చిన విరాళాల వివరాలతో కూడిన నివేదిక ప్రకారం, జాతీయ పార్టీలు నగదు రూపంలో రూ.3.18 లక్షల పొందాయి. అదేవిధంగా 2004-05, 2019-20 ఆర్థిక సంవత్సరాల మధ్య కూపన్లు అమ్మకం ద్వారా కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలకు ఉమ్మడిగా రూ.4,096.72 కోట్ల ఆదాయం వచ్చిందని ఏడీఆర్ తెలిపింది. గుర్తుతెలియని వ్యక్తులు, వనరులు అంటే ఆదాయ పన్ను రిటర్న్స్‌లో ఆదాయాన్ని ప్రకటించి, రూ.20 వేల కంటే తక్కువ విరాళాలకు సంబంధించి ఆదాయ వనరులు చూపనివి. అలాంటి గుర్తుతెలియని వనరుల్లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు, కూపన్ల అమ్మకం, సహాయ నిధి, ఇతరత్రా ఆదాయం, స్వచ్ఛంద సహకారాలు, సమావేశాలు/మోర్చాల నుంచి సహకారం వంటివి ఉన్నాయి. స్వచ్ఛంద సహకారం వంటి దాతల వివరాలు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో లేవు. విరాళాలకు సంబంధించి పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడానికి కాగ్, ఎన్నికల కమిషన్ ఆమోదించిన సంస్థ ద్వారా రాజకీయ పార్టీలు సమర్పించిన ఆర్థిక పత్రాలపై ఏటా పరిశీలన నిర్వహించాలని ఏడీఆర్ సిఫారసుచేసింది. అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఆర్టిఐ చట్టం కింద సమాచారం ఇవ్వాలనీ, తద్వారానే ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని పేర్కొంది.