Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరూ సిద్ధం కావాలంటూ ఐసీఎంఆర్ హెచ్చరికలు
- భారత్‌లో పెరిగిన ఆర్ వ్యాల్యూ
- యూరప్‌లో వారంలో 11 శాతం పెరిగిన మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం మళ్లీ పెరుగుతోంది. దీనికనుగుణంగా కొత్త కేసులు అధికమవుతున్నాయి. దీంతో కరోనా థర్డ్‌వేవ్ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కు చెందిన అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ సమిరన్ పాండా మాట్లాడుతూ.. కరోనా థర్డ్‌వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయనీ, సెకండ్‌వేవ్ తీవ్రత ఎక్కువగా లేని రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ఈ ట్రెండ్ థర్డ్‌వేవ్ సంకేతాలను చూపుతోందని ఆయన హెచ్చరించారు. సెకండ్‌వేవ్ సమయంలో అనేక రాష్ట్రాలు చర్యలు తీసుకుంటూ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయని దీంతో పెద్దమొత్తంలో సెకండ్‌వేవ్ తీవ్రతను అడ్డుకోగలిగామని పేర్కొన్నారు. ప్రస్తుతం అందరూ థర్డ్‌వేవ్‌కు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు.
అక్టోబరు-నవంబరు మధ్య ఉధృతం..
దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచే ఉందనీ, అక్టోబరు-నవంబరు మధ్య ఉధృతంగా ఉండొచ్చని ఐఐటీ-కాన్పూరు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ప్రస్తుత వేరియంట్లకు భిన్నంగా ఏదైనా కొత్త రకం బయటపడితేనే దీని ప్రభావం అధికంగా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే, సెకండ్‌వేవ్‌తో పోలిస్తే థర్డ్‌వేవ్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చునని పేర్కొన్నారు. ఐఐటీ-కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ నేతృత్వంలోని ముగ్గురు శాస్త్రవేత్తల బృందం జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న వేరియంట్లే మున్ముందు కొనసాగితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు ఉండవని పేర్కొన్నారు.
వేగంగా కరోనా వ్యాప్తి
కాగా, దేశంలో ప్రస్తుతం ఆర్-వ్యాల్యూ పెరుగుతుండటంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజుల వ్యవధిలో ఆర్-విలువ 1.17 కు పెరిగినట్టు డేటా పేర్కొంది. కేరళ, మహారాష్ట్రలో వేగంగా కరోనా వ్యాప్తి చెందుతుండటం దేశం మొత్తం ఆర్-విలువను పెంచింది. చివరిసారిగా భారతదేశం ఆర్-విలువ 2021 మార్చి 19న 1.19కి చేరింది.ఆ తర్వాత సెకండ్‌వేవ్ ప్రారంభమైంది. ఒక రోగి నుంచి ఇన్ఫెక్షన్కు గురయ్యే సగటు వ్యక్తుల అంచనాను ఆర్-వ్యాల్యూగా పేర్కొంటారు.
30 వేలకు పైగా కొత్త కేసులు
గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 30,941 పాజిటివ్ కేసులు, 380 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 3,27,37,939కి చేరగా, మరణాలు 4,38,210కి పెరిగాయి. ప్రస్తుతం 3,76,324 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 3,19,23,405 మంది కోలుకునాన్నరు. కాగా, దేశంలో ఇప్పటి వరకు 64.05 కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేశారు.
కేరళ నుంచి వస్తే క్వారంటైన్ !
ప్రస్తుతం కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న కేరళ నుంచి వచ్చే వారికి ఏడు రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేస్తున్నట్టు కర్నాటక ప్రకటించింది. తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలు సోమవారం నుంచి 9-12 తరగతుల వారికి పాఠశాలలను ప్రారంభించాయి. మహారాష్ట్రలో దహిహండి పండుగ సందర్భంగా నిర్వహించే సాంప్రదాయ క్రీడ అయిన మానవ పిరమిడ్లు సహా బహిరంగా సమావేశాలన్నింటిని నిషేధించింది.
- డిసెంబర్ నాటికి యూరప్‌లో 2.36 లక్షల మరణాలు
డిసెంబర్ నాటికి యూరప్‌లో దాదాపు 2.36 లక్షల కరోనా మరణాలు సంభవించవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ డైరెక్టర్ హన్స్ క్లూగే చెప్పారు. గత వారం రోజుల్లో యూరప్‌లో కరోనా మరణాలు 11 శాతం పెరిగాయని తెలిపారు. ఇటీవల దక్షిణాప్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ నుంచి టీకాలు రక్షణ కల్పించడం లేదని పీటీఐ ఓ కథనంలో పేర్కొంది. మూడు నెలల్లో ఒక కోటి డోసులను ఆఫ్రికా దేశాలకు అందిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 21.63 కోట్ల మందికి వైరస్ సోకిందని జాన్హాప్కిన్స్ వర్సిటీ తెలిపింది. అలాగే, 45 లక్షలకు పైగా మరణాలు సంభవించాయని పేర్కొంది.