Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల వెనుక భాగంలో తీవ్ర గాయం
- మొత్తం నీలి రంగులోకి మారిన శరీరం
- ఆస్పత్రిలో కూడా చేర్చుకోలేదు : కుటుంబ సభ్యులు
- ఏఐకేఎస్ రూ. లక్ష సాయం
న్యూఢిల్లీ : పోలీసుల లాఠీఛార్జ్ వల్లే రైతు సుశీల్ కాజోల్ మరణించాడని ఆయన భార్య సుదేష్ దేవీ, తల్లి మూర్తి తెలిపారు. ఆయన గుండెపోటుతో మరణించలేదని స్పష్టంచేశారు. పోలీసులు, హర్యానా ప్రభుత్వం కావాలనే గుండెపోటుతో మరణించినట్టు చిత్రీకరించారని వాపోయారు. హర్యానాలోని కర్నాల్‌లో బస్తారా టోల్ ప్లాజా వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు పాశవికంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ లాఠీఛార్జ్‌లో అనేక వందలాది మంది రైతులకు గాయాలయ్యాయి. గాయాలు పాలైన సుశీల్ కాజోల్ అనే రైతు అదే రోజు రాత్రి మరణించారు. అయితే ఆయన గుండెపోటుతో మరణించినట్టు హర్యానా ప్రభుత్వం, పోలీసు శాఖ ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని బాధిత కుటుంబం తీవ్రంగా ఖండించింది. రైతు సుశీల్ కాజోల్ భార్య సుదేష్ దేవీ, తల్లి మూర్తిని కలిసిన మీడియాకు వారు వాస్తవ విషయాలను వెల్లడించారు. మూడు రైతు చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ గతేడాది నవంబర్‌లో ఉద్యమం ప్రారంభం అయినప్పటి నుంచి సుశీల్ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాడు. ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింఘూలో జరుగుతున్న ఉద్యమంలో గత తొమ్మిది నెలలుగా పాల్గొన్నారు. ఆగస్టు 28 (శనివారం) కర్నాల్ బస్తారా టోల్‌ప్లాజా వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీఛార్జ్‌లో సుశీల్ కాజోల్ తీవ్రంగా గాయాలు పాలయ్యాడు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తే చేర్చుకోలేదు. ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించేశారు. ఆయన తీవ్రమైన గాయాలు, నొప్పులుతోనే ఇంటికి చేరుకున్నారు. లేవలేనంత స్థాయిలో నొప్పులు ఉన్నాయి. దీంతో పెయిన్ కిల్లర్ మాత్ర వేసుకున్నారు. అయినా నొప్పులు తగ్గలేదు. రాత్రి భోజనం చేయాలని భార్యా అడిగితే తినలేనని, నొప్పులు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. రాత్రి సమయంలో నొప్పులు ఒక్కసారిగా పెరిగాయి. తల వెనుక లోపలి భాగంలో నరాల్లో నొప్పు తీవ్రంగా ఉందని తెలిపాడు. కొద్దిసేపటికి తల వెనుక భాగం, భుజం, పొట్ట ఉబ్బాయి. శరీరం నీలిరంగులోకి మారింది. అలా కొద్ది సేపు నొప్పులతో బాధపడుతూ ప్రాణాలు విడిచారని ఆయన భార్యా, తల్లి తెలిపారు. ఇప్పటి వరకు తమ ఇంటిని ఏ ప్రభుత్వ అధికారి కానీ, పోలీసులు కాని సందర్శించలేదని అన్నారు. కానీ ఆయన మరణాన్ని గుండెపోటులా చిత్రీకరిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. తమ ఇంటి పెద్ద మరణించాడనీ, ఆయన ఇక రాడనీ.. అయితే మూడు చట్టాల రద్దు. కనీస మద్దతు ధర లభించేవరకూ పోరాటం చేయటంవల్లే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు. సుశీల్ కాజోల్ తండ్రి చనిపోయి దాదాపు పదేండ్లు కావస్తున్నదనీ, అప్పటి నుంచి ఆయనే ఇంటిని పోస్తున్నారని ఇతర కుటుంబ సభ్యులు తెలిపారు. హర్యానాలోని కర్నాల్ జిల్లా, ఘారోడా మండలం, రాయపూర్ జట్టన్ గ్రామంలో నివాసం ఉంటున్న సుశీల్‌కు తల్లి మూర్తి(80), భార్య సుదేష్ దేవి (45), కుమారుడు షాహిద్ (24), కుమార్తె అను (26) ఉన్నారు. సుశీల్ కాజోల్కు ఎకర్నర భూమి ఉంది. పశుపాల శాల ఉంది. ఇవే వారి జీవనోనపాధి, కుటుంబం మొత్తం వాటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
ఆయన కుటుంబాన్ని పరామర్శించిన ఏఐకేఎస్ బృందం
అమరవీరుడు సుశీల్ కాజోల్ కుటుంబాన్ని ఏఐకేఎస్ ప్రతినిధి బందం సందర్శించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. కుటుంబానికి తక్షణ సహాయంగా ప్రతినిధి బందం రూ.లక్ష సాయం అందజేసింది. చెక్కును అమరవీరుడి భార్య సుధేష్ దేవికి ఏఐకేఎస్ కోశాధికారి పి కష్ణప్రసాద్, ఏఐకేఎస్ హర్యానా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఫూల్ సింగ్ షెయోకాండ్, సుమిత్ సింగ్ అందజేశారు. ప్రతినిధి బందం కుటుంబ సభ్యులను ఓదార్చి, వీలైనంత త్వరగా వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. వారితోపాటు కుటుంబాన్ని సందర్శించిన వారిలో ఎఐకెఎస్ కర్నాల్ జిల్లా నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా కష్ణప్రసాద్ మాట్లాడుతూ తక్షణ సాయంగా రూ.లక్ష అందించామనీ, త్వరలోనే మరికొంత సాయం అందిస్తామని చెప్పారు. ఇప్పటికే తమ రాష్ట్ర, జిల్లా కమిటీలు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. సుశీల్ కాజోల్‌ది ప్రభుత్వ హత్య అని విమర్శించారు. ఆయన కుటుంబానికి రూ.25 లక్షల సాయం అందించాలనీ, కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం చేయకుండానే గుండెపోటుగా ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. రైతు సుశీల్ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలనీ, ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.