Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలియన్‌వాలా బాగ్ పునర్నిర్మాణంపై చరిత్రకారుల ఆందోళన
- అమరవీరులను అవమానించడమే : రాహుల్
అమృత్సర్ : పంజాబ్‌లోని అమృత్సర్ నగరంలో జలియన్‌వాలా బాగ్‌ను పునరుద్ధరించిన తీరు చరిత్రను తొలగించేలా కనిపిస్తున్నదనే ఆందోళనలు చరిత్రకారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల జలియన్‌వాలా బాగ్‌ను పునర్నిర్మించిన విషయం విదితమే. దీనికి సంబంధించిన స్మారక చిహ్నాన్ని రెండు రోజుల క్రితమే ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఏప్రిల్ 13, 1919న అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్ వద్ద గుమిగూడిన భారతీయులపై బ్రిటీషు సైన్యం కాల్పులు జరిపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 102 ఏళ్ల క్రితం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నేతృత్వంలో జరిగిన కాల్పుల్లో వెయ్యిమందికి పైగా మరణించారు.
కాగా, జలియన్‌వాలా బాగ్ పునర్నిర్మాణంలో భాగంగా, ఇరుకైన లేన్ గోడలు (దీని ద్వారా జనరల్ డయ్యర్ నేతృత్వంలోవని సైనికులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు) శిల్పాలతో చెక్కి ఉన్నాయి. ఓ వార్త సంస్థ కథనం ప్రకారం.. బాగ్‌లోకి ప్రవేశించే, నిష్క్రమించే ప్రదేశాలు కూడా మార్పునకు గురయ్యాయి. ముఖ్యంగా, ప్రధాన నిర్మాణం చుట్టూ లోటస్‌పాండ్‌ను నిర్మించడం గమనార్హం. అయితే, పంజాబ్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో జలియన్‌వాలా బాగ్ పునర్నిర్మాణం ప్రాముఖ్యతను సంతరించుకున్నది. షాహిదీ ఖు (అమరవీరుల బావి) ఇప్పుడు ఒక గాజు కవచంతో కప్పబడి ఉన్నదని సదరు వార్త సంస్థ పేర్కొన్నది. ''జలియన్‌వాలా బాగ్ పునరుద్ధరణ జరిగిందని విన్నప్పుడు ఏదోలా అనిపించింది. దీని చివరి ఆనవాళ్లను తొలగించారు'' అని గ్లోబల్ ఇంపీరియల్ హిస్టరీ ప్రొఫెసర్ కిమ్ ఏ వాగెర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ప్రాణత్యాగాలను అర్థంచేసుకోలేరు : రాహుల్
పంజాబ్‌లోని జలియన్ వాలాబాగ్ స్థూపం పునరుద్ధరణపై కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అమరవీరుడి కుమారుడినేనని, అమరవీరులను అవమానించ డాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ట్విటర్లో తెలిపారు. ప్రాణత్యాగమంటే అర్థం తెలియని వారే జలియన్‌వాలాబాగ్ ఘటనలో ప్రాణాలు అర్పించిన అమరవీరులను అవమానపరచగలరని ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేయనివారు వారి ప్రాణత్యాగాన్ని అర్థం చేసుకోలేరని ట్వీట్ చేశారు.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనివారే అపఖ్యాతి పాల్జేయగలరు : ఏచూరి
చారిత్రాత్మక స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనివారు మాత్రమే ఇలా అపఖ్యాతి పాల్జేయగలరని సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరీ పేర్కొన్నారు. అమరవీరుల ప్రాణత్యాగాలను మోడీ సర్కార్ ఎద్దేవా చేస్తున్నదని ఆరోపించారు.తనను సాంప్రదాయ వాది అని పిలిచినా పరవాలేదనీ, కానీ ఇటువంటి గౌరవప్రదమైన చిహ్నాలకు డిస్కోలైట్లను అమర్చడానికి తాను వ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోరు ట్వీట్ చేశారు. ఇటువంటి చర్యలు జలియన్‌వాలాబాగ్ చరిత్రను, పోరాట స్ఫూర్తిని తగ్గించి.. వినోదాత్మకంగా కనిపించేలా చేస్తాయని అన్నారు. పోరాటం, ప్రాణత్యాగం, విషాద ఘటనలకు స్పూర్తిగా నిలిచిన చిహ్నాలను అందంగా, ఆడంబరంగా, వినోదాత్మకంగా మార్చడం సరికాదని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరిగిన ఘటన యధార్థమనీ, నష్టం అపారమనీ, విషాధం మరిచిపోలేనిదని.. అక్కడి పరిసరాలు ఆ త్యాగధనుల బాధను గుర్తుకు తెస్తాయని.. వాటిని ఆధునీకరణ పేరుతో ఇలా మార్చడం జ్ఞాపక చిహ్నాలకు, చరిత్రకు నష్టం కలిగించడమేనని అన్నారు.
స్మారక చిహ్నాలనూ కార్పొరేటీకరించడమే : చరిత్రకారులు
ఈ చర్య స్మారక చిహ్నాలనూ కార్పొరేటీకరించడమని ప్రముఖ చరిత్రకారుడు ఎస్.ఇర్ఫాన్ హబీబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వారసత్వ విలువలను కోల్పూతూ ఆధునిక నిర్మాణాలుగా మిగులుతాయని..స్మారక చిహ్నాలను కాలాలకనుగుణంగా మార్పులు చేయకుండా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. అమత్‌సర్‌లో 1919లో మారణకాండ జరిగిన ప్రదేశమైన జలియన్‌వాలాబాగ్ పునరుద్ధరించబడిందని విన్నానని,. అది వినాశనమని..అంటే ఆ ఘటన చివరి ఆనవాళ్లు కూడా లేకుండా సమర్థవంతంగా తొలగించబడ్డాయని మరో చరిత్రకారుడు కిమ్ ఎ. వాగర్ మండిపడ్డారు.