Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూత్వ సంస్థల తీరుకు తీవ్ర ఖండన
- 'డిస్మ్యాంట్లింగ్ గ్లోబల్ హిందూత్వ'కు 700 మంది విద్యావ్తేతల మద్దతు
న్యూఢిల్లీ : దేశంలో విద్వేషాన్ని రగుల్చుతున్న కొన్ని హిందూత్వ సంస్థలు, గ్రూపులు, వ్యక్తుల ఉద్దేశాన్ని, వారి లక్ష్యాలను బయటపెట్టడంలో భాగంగా నిర్వహించబోయే ఆన్లైన్ కార్యక్రమం 'డిస్మ్యాంట్లింగ్ గ్లోబల్ హిందూత్వ'కు విద్యావేత్తలు, స్కాలర్స్ నుంచి మద్దతు లభించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించకూడదంటూ తప్పుబడుతూ కొన్ని హిందూ సంస్థలు ఈ కార్యక్రమంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే. ఇది ఒక 'హిందూ వ్యతిరేక' కార్యక్రమమని ఆరోపించాయి. అయితే, దీనిపై విద్యావేత్తలు స్పందించారు. ఈ ఆన్లైన్ కార్యక్రమానికి మద్దతుగా తమ సంతకాలతో కూడిన లేఖను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్న హిందూత్వ సంస్థల ప్రయత్నాలను వారు తీవ్రంగా ఖండించారు.
ఈ ఆన్లైన్ కార్యక్రమం ఈనెల 10 నుంచి 12 తేదీల్లో జరగనున్నది. ఆ కాన్ఫరెన్స్‌లో అనేక మంది భారతీయ విద్యావేత్తలు, మేధావులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు పాల్గొననున్నారు. వీరిలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు కవితా కృష్ణన్, ఫిల్మ్‌మేకర్ ఆనంద్ పట్వర్ధన్, రచయిత మీనా కందస్వామి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయేషా కిద్వారు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, సోషియాలజిస్ట్ నందినీ సుందర్ లతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో 'గ్లోబల్ హిందూత్వ అంటే ఏమిటీ?', 'జెండర్ అండ్ సెక్సువల్ పాలిటిక్స్ ఆఫ్ హిందూత్వ' నుంచి 'క్యాస్ట్ అండ్ హిందూత్వ', 'వైట్ సుప్రిమసీ' వరకు అనేక అంశాలను చర్చించనున్నారు. హార్వర్డ్, స్టాన్‌పోర్డ్, కార్నెల్, ప్రిన్స్టన్తో పాటు దాదాపు 49కి పైగా యూనివర్సిటీలకు చెందిన సుమారు 70 విభాగాలు ఈ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనుండటం గమనార్హం.
కాగా, దేశంలో అసమ్మతిని అణగదొక్కే క్రమంలో దేశంలోని మోడీ ప్రభుత్వం ప్రజలను, సామాజిక కార్యకర్తలను వేధింపులకు, బెదిరింపులకు గురి చేస్తున్నదని లేఖలో వారు ఆరోపించారు. ఇందుకు దొరికిన ఏ ఒక్క చిన్న అంశాన్నీ వదులుకోవడం లేదని వివరించారు. దేశంలో అనేక మంది విద్యార్థి నాయకులు, మానవ హక్కుల కార్యకర్తలు ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద జైలు జీవితాన్ని గడపడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.