Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గత 19 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత రికార్డుస్థాయి వర్షపాతం బుధవారం నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. భారీ వర్షాల కారణంగా ఐఎండీ కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్‌ను ప్రకటించింది. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 112.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా రోడ్డుపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులనెదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనదారులను పక్క దారికి మళ్లించారు. మరోవైపు వర్షపునీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఇక 17 నెలల తర్వాత నగరంలో పాఠశాలలు పున: ప్రారంభమైన రోజునే భారీ వర్షాలు కురవడంతో... విద్యార్థులు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వరదలను దాటుకుంటూ స్కూల్స్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
గత నెల ఆగస్టులో దేశం మొత్తం మీద సాధారణ వర్షపాతం కంటే 24శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే ఈ నెల సెప్టెంబరులో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే ఢిల్లీలోని ఎన్సీఆర్, గురుగ్రామ్, మానేసర్, ఫరీదాబాద్, బల్లాభగడ్, తోషమ్, భివానీ, ఝాజ్జర్, నార్నాల్, మహేందర్‌గఢ్, కోసలి ప్రాంతాల్లో రాగల రెండు గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ ట్వీట్లో తెలిపింది. ఢిల్లీలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో.. పలు ప్రాంతాలు నీటమునిగాయి.
కాగా, ఢిల్లీలో ఆగస్టు 30 వరకు 144.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెలలో నమోదయ్యే సాధారణ వర్షపాతం 209.4 మి.మీ కన్నా 31శాతం తక్కువ నమోదైందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇక భారత వాతావరణశాఖ డైరెక్టర్ జనరల్ మత్యుంజరు మెహపాత్రా మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో మధ్య భారతదేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కన్నా.. ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం రుతుపవనాల లోటు 9శాతంగా ఉంది. సెప్టెంబర్‌లో కురవబోయే వర్షాల వల్ల రుతుపవనాల లోటు కూడా తగ్గే అవకాశంముందని ఆయన అంటున్నారు. అలాగే ఈ నెలలో ఉత్తర, ఈశాన్య భారతదేశం, దక్షిణ భారతదేశంలోని దక్షిణ ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాపాతం నమోదవ్వనున్నట్టు మెహపాత్రా తెలిపారు.