Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 'ది వైర్' సంస్థ 2021కి గాను 'ఫ్రీ మీడియా పయనీర్' అవార్డును దక్కించుకున్నట్టు ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ (ఐపీఐ) బుధవారం ప్రకటించింది. భారత్‌లోని డిజిటల్ న్యూస్ విప్లవంలో మొదటిస్థానం సంపాదించడంతో పాటు బెదిరింపులకు తలొగ్గకుండా స్వతంత్ర సంస్థగా నాణ్యతతో కూడిన వార్తలను అందించిందని ఐపీఐ తెలిపింది. ఈ ఏడాదికిగాను ఐపీఐ - ఐఎంఎస్ ఫ్రీ మీడియా పయనీర్ అవార్డుకు వైర్ మీడియాను ఎంపిక చేయడం మాకు గర్వంగా అనిపించిందని ఐపీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బార్బరా ట్రియోన్సీ పేర్కొన్నారు. డిజిటల్ వార్తల ప్రపంచంలో నాణ్యతతో కూడిన వార్తలను అందించడంలో ప్రముఖంగా నిలిచిందనీ, స్వతంత్ర జర్నలిజమ్ పట్ల 'వైర్' నిబద్ధత ఐపీఐ సభ్యులకు స్పూర్తినిచ్చిందని అన్నారు. క్లిష్టమైన రిపోర్టింగ్‌లో, పత్రికా స్వేచ్చలో వైర్ సిబ్బంది అందిస్తున్న కషికి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొనే సమయంలో మీడియాకు అండగా నిలబడతామని బార్బరా పేర్కొన్నారు. ఆస్ట్రియాలోని వియన్నాలో సెప్టెంబర్ 16న జరగనున్న ఐపీఐ వార్షిక సమావేశంలో ఈ అవార్డును బహుకరిస్తామని అన్నారు. కాగా, ఐపీఐ అనేది మీడియా ఎగ్జిక్యూటివ్స్, ఎడిటర్స్, జర్నలిస్టులతో కూడిన అంతర్జాతీయ నెట్వర్క్. ప్రపంచవ్యాప్తంగా పత్రికా రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నది. ఫ్రీ మీడియా పయనీర్ అవార్డు 1996లో స్థాపించారు. మెరుగైన జర్నలిజం, నాణ్యతతో కూడిన వార్తలను అందించడమే కాకుండా తమ దేశంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేసే వార్తా సంస్థలను ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది. గత ఏడాది ఈజిప్ట్ వార్తల వెబ్సైట్ మదా మాసర్కు ఈ అవార్డు లభించింది. అంతకుముందు పిలిఫ్పైన్స్కు న్యూస్ సంస్థ రాప్లర్, రష్యాకు చెందిన నొవ్యా గెజటాలు ఉన్నాయి.
కాగా, ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని ది వైర్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ సిద్ధార్ద్ వరదరాజన్ అన్నారు. దేశంలోని డిజిటల్ మాధ్యమాలను ప్రభావితం చేసే రాజకీయ, కార్పొరేట్ ఒత్తిళ్లు లేకుండా, ప్రజలకు నాణ్యతతో కూడిన వాస్తవాలను అందించాలన్న మా లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అహర్నిశలు కృషి చేశామన్నారు. అందుకు ప్రతిఫలంగా పరువు నష్టం కేసులు, క్రిమినల్ కేసులు, ఆర్థిక ఒత్తిడులను ఎదుర్కొన్నామని, అయితే ప్రపంచవ్యాప్తంగా లభించిన ఈ గుర్తింపుతో అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయని అన్నారు. వాస్తవాలను అందించడంలో 'వైర్' సంస్థ ప్రభుత్వ ఒత్తిడులను ఎదుర్కొంది. ఈ ఏడాది రైతుల నిరసనపై వరుస కథనాలను అందించినందుకు గాను రిపోర్టర్లపై మూడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2020లో మత ప్రచారకులు కరోనా నిబంధనలను ఉల్లంఘించారన్న వార్తలను ప్రచురించినందుకు భయాందోళనలకు గురిచేశారు. గతంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తుల నుంచి 14 పరువు నష్టం కేసులతో పాటు 1.3 బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఒత్తిడిని ఎదుర్కొంది. వైర్ సంస్థ, ఎడిటర్ వరదరాజన్లపై ఈ కేసులు నమోదయ్యాయి. ఇటీవల పార్లమెంటును కుదిపేసిన పెగాసెస్ స్పైవేర్ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురావడంతో సంస్థతో పాటు జర్నలిస్టులు అధికారపార్టీకి లక్ష్యంగా మారారు. ఫొర్బిడెన్ స్టోరీస్‌తో పాటు వైర్ ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపింది. ఐటి చట్ట సవరణలను సవాలు చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరులో ముందువరుసలో నిలిచింది.