Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరిహద్దులకు చేరుకున్న వేలాది మంది
- హర్యానాలో 2,500 మందిపై కేసులు
న్యూఢిల్లీ : ఢిల్లీ ఆందోళనలో భాగస్వామ్యం అయ్యేందుకు బీహార్ నుంచి వేలాది మంది రైతులు దేశ రాజధానికి చేరుకున్నారు. ఏఐకేఎస్ ఆధ్వర్యంలో బీహార్ నుంచి ఘాజీపూర్ సరిహద్దుకు వారు చేరుకొన్నారు. ఆందోళనలో ఉన్న అన్నదాతలతో కలిసి పదిరోజులపాటు వారు ఉద్యమంలో పాల్గొననున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో కిసాన్ మినీ పంచాయతీ జరిగింది. రైతు నేత యోగేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ ఆందోళనలో విద్యార్థులు, యువత అంతర్భాగమయ్యారు. పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థులు నిర్వహించిన సమావేశంలో ఎస్కేఎం నాయకులు దర్శన్ పాల్ తదితరులు పాల్గొన్నారు. పటియాలాలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఆర్థికవేత్తలు కూడా పాల్గొన్నారు.
లాఠీచార్జ్‌ను ఖండిస్తూ ఆందోళనలు
హర్యానా ప్రభుత్వ రైతు వ్యతిరేక, అనాగరిక వైఖరిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కర్నాల్ బార్ అసోసియేషన్ సభ్యులు మినీ సెక్రటేరియట్ వద్ద ఆందోళన చేపట్టారు. లాఠీచార్జ్‌కి కారకులైన ఎస్డీఎం ఆయుష్ సిన్హా. ఇతరులపై రెండు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అల్టిమేటం ఇచ్చారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) కూడా సెప్టెంబర్ 2న (నేడు) నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు నుంచి హర్యానా భవన్ వరకు నిరసన మార్చ్ చేపట్టనున్నట్టు ఐలు తెలిపింది. సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐఎంఎల్, ఎస్‌యూసీఐ పార్టీలు సంయుక్తంగా వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించాయి.
హర్యానాలో 2,500 మంది రైతులపై కేసులు
అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, కర్నాల్, అజ్జర్, సిర్సా, సోనేపట్, కైతాల్తో పాటు ఇతర ప్రాంతాల్లో 2,500 మందికి పైగా రైతులపై హర్యానా ప్రభుత్వం కేసులు బనాయించింది. వీటిని తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఎస్కేఎం చేసింది. కర్నాల్‌లో 120 మంది రైతులు, 300 మంది గుర్తుతెలియని ఇతరులపై 12కు పైగా కేసులు నమోదు చేశారు. బస్తారా టోల్ ప్లాజాకు సంబంధించి 700 మంది గుర్తుతెలియని వ్యక్తులు, 91 మంది రైతులపై 6 కేసులు నమోదు చేశారు.
రైతులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు
జనవరి 26కు సంబంధించిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 160 కింద రైతులను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఇది రాజ్యాంగ, చట్ట విరుద్ధమని ఎస్కేఎం లీగల్ ప్యానెల్ ఖండించింది. ఎందుకంటే ఈ నోటీసులు అందుకున్న రైతులెవరూ ఎఫ్ఐఆర్లో పేరు ఉన్నవారు కాదనీ, వారి పేర్లు ఎఫ్ఐఆర్లోలేవని, వారు ఏ హింసాత్మక సంఘటనల్లోనూ పాల్గొనలేదని స్పష్టం చేసింది.