Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా దెబ్బకు మారిన జాబ్ మార్కెట్ పరిస్థితులు
- కోట్లాది కుటుంబాలు పేదరికంలోకి : 'ఇండియా స్పెండ్' అధ్యయనంలో ఆర్థిక నిపుణులు
గత ఏడాది నుంచి మొదలైన కోవిడ్-19 సంక్షోభం దెబ్బకు దేశంలో కోట్లాది మంది పేదలు, మధ్యతరగతి ఉపాధి కోల్పోయారు. పరిస్థితులు మారకపోతాయా? పోయిన ఉద్యోగాలు రాకపోతాయా? అని ఎంతోమంది ఎదురుచూశారు. దాదాపు ఏడాదిన్నర కావస్తోంది...ఇప్పటికీ జాబ్ మార్కెట్లో మునపటి (కరోనాకు ముందు) పరిస్థితులు లేవు. ఈ సంగతి ఇప్పుడిప్పుడే మధ్య తరగతి జనానికి అర్థమవుతోందని..'ఇండియాస్పెండ్' తాజా అధ్యయనం పేర్కొంది. మధ్య తరగతికి చెందిన కోట్లాది కుటుంబాలు 'కోవిడ్ సంక్షోభం' తర్వాత పేదరికంలోకి కూరుకు పోయాయని అధ్యయనం తెలిపింది. ఇందులోని ముఖ్యమైన అంశాలు ఈ విధంగా ఉన్నాయి..
న్యూఢిల్లీ : నగరాలు, పట్టణాలు, గ్రామాలు..అనే తేడా లేకుండా కోవిడ్ సంక్షోభం పేదలు, మధ్య తరగతిపై ప్రతాపం చూపింది. ఆర్థిక క్రమశిక్షణతో ఎన్నో ఏండ్లు పొదుపుచేసుకున్న మొత్తాలు సైతం కరిగిపోయాయని మధ్య తరగతి ఆవేదన చెందుతోంది. ''ఇప్పుడు ఏదో ఒక పని లేకపోతే కుటుంబం గడిచే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు''అని అనేక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికాకు చెందిన మేథో బృందం 'ప్యూ రీసెర్చ్ సెంటర్' వారి విశ్లేషణ ప్రకారం, భారత్లో కరోనా సంక్షోభం కారణంగా మధ్య తరగతికి చెందిన 3.2కోట్లమంది ఆర్థిక పరిస్థితి దిగజారి పేదరికంలోకి వెళ్లిపోయారు. ప్రపంచంలో 60శాతం వాటా భారత్ నుంచే నమోదైంది. ''మధ్య తరగతిలో అత్యధికశాతం మంది అసంఘటిత రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. వీరిపై సంక్షోభ ప్రభావం ఎక్కువగా ఉంది. వీరిలో చాలా మంది పేదరికంలోకి వెళ్లిపోయారు. సంఖ్య ఎంతన్నది కచ్చితంగా ఇప్పుడే చెప్పలే''మని ఆర్థిక, సామాజిక పరిశోధకురాలు మరయం అస్లానీ అన్నారు.
నెమ్మదించిన ఆర్థిక రికవరీ
ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే లాక్డౌన్ ఎత్తేసాక..మళ్లీ మునపటి పరిస్థితులు వస్తాయనే మొదట అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. ఆర్థిక రికవరీ నెమ్మదించింది. అందువల్లే ఉపాధి మెరుగుపడటం లేదని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. ''దేశంలో మధ్య తరగతి సంఖ్య 2001 నుంచి 2011లో 12.9 కోట్ల నుంచి 22.8కోట్లకు పెరిగింది. ఇందులో అత్యధికశాతం మందికి స్థిరమైన ఉద్యోగాల్లేవు. కరోనా సంక్షోభ ప్రభావం వీరిపై ఎక్కువగా నమోదైంది. కాబట్టే కొనుగోలు సామర్థ్యం పడిపోయిందని అనేక అధ్యయనాల్లో బయటపడింది'' అని అమెరికాలోని డ్యూక్ వర్సిటీ ప్రొఫెసర్ క్రిష్ణ చెప్పారు.
90శాతానికి చోటేది
భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే, 10 శాతం ఆదాయం, వినియోగం పెరుగుదల ఉందనుకుంటే... మిగతా 90శాతం స్తబ్దుగా ఆగిపోయింది. దేశ జనాభాలో కొద్ది మందికి మాత్రమే ఈ ఆర్థిక వ్యవస్థలో చోటుంది. ఒక్కశాతమున్న కార్పొరేట్లు, ధనికులు, అత్యంత ధనికుల ఆదాయాలు పెరిగాయి. ఖర్చులు పెరిగాయి. మిగతా జనం పరిస్థితి ఏంటి? వీరిని కేవలం వినియోగదారులగానే చూస్తున్నారు.
- మైత్రీష్ ఘాతక్, ఆర్థిక ప్రొఫెసర్,
లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్.