Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఉద్యమం పట్ల మోడీ సర్కార్ నిర్లక్ష్యం
- కర్షకులపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ గూండాల దాడులు : ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా
న్యూఢిల్లీ : మూడు నల్ల చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు ప్రధాని మోడీకి తీరిక దొరకలేదా? అని ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా ప్రశ్నించారు. దేశంలో రైతుల ఉద్యమం ప్రపంచంలోనే ఎన్నడూ జరగని చారిత్రాత్మక శాంతియుత పోరాటమన్నారు. దేశానికి స్వాతం త్రం సిద్ధించిన తరువాత అతి సుధీర్ఘంగా జరిగిన పోరాటమ న్నారు. బుధవారం ఏఐకేఎస్ ప్రధాన కార్యాలయంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హన్నన్ మొల్లా మాట్లాడారు. దేశంలోని రైతు ఉద్యమం ఒక కొత్త గుర్తింపును సొంతం చేసుకున్నదనీ, భవిష్యత్తు ఉద్యమాలకు ఒక సందేశమిస్తున్నదని తెలిపారు. అత్యధిక చలి, ఎండ, వర్షాలు ఉన్నప్పటికీ రైతుల పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, చివరికి మరణించినా చట్టాలు రద్దు అయ్యే వెనక్కి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం
రైతు ఉద్యమం పట్ల మోడీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నదని హన్నన్ మొల్లా విమర్శించారు. జనవరి తరువాత రైతులతో ఒక్కసారి కూడా చర్చ చేపట్టలేదని విమర్శించారు. చట్టాలు సవరణ చేస్తే సరిపోదనీ, ఎందుకంటే చట్టాల మౌలిక అంశాలే రైతులకు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపారు. ఈ మూడు చట్టాలు రద్దు చేసి, రైతులతో చర్చించి కొత్త చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను గంటలో రద్దు చేసిన మోడీ సర్కార్‌కు, రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయడానికి సమయం లేదా? అని ప్రశ్నించారు. కార్పొ రేట్ ఎజెండా నుంచి పుట్టుకొచ్చిన చట్టాలు కనుకనే మోడీ సర్కార్ రద్దుకు సిద్ధపడటం లేదని విమర్శించారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేం దుకే మోడీ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులతో ప్రభుత్వం చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించు కోవచ్చనీ, మధ్యవర్తులు అవసరం లేదని పేర్కొన్నారు.
రైతులపై హిందూత్వ గూండాల దాడి
రైతుల ఆందోళనలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ గూండాలు దాడులు చేశారని హన్నన్ మొల్లా విమర్శించారు. టిక్రీ, సిం ఘూ, ఘాజీపూర్, పల్వాల్, షాజాహన్‌పూర్ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ గూం డాలు వివిధ సందర్భాల్లో దాడులు చేశారని తెలిపారు. రైతు ల వస్తువులు, ఆహార పదార్థాలు, సభ వేదికలు ధ్వంసం చేశా రని అన్నారు. కానీ ఒక్కరిపైన కూడా కేసు నమోదు చేయలే దనీ, చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వీటిని తిప్పికొట్టి ఉద్యమం జరుగుతుందని చెప్పారు.
ప్రభుత్వ హత్యలు
రైతు ఉద్యమంలో 600 మంది పైగా రైతులు అమరవీరులయ్యారని అన్నారు. అయితే ఇద్దరు రైతులను మాత్రం ప్రభుత్వమే హత్య చేసిందని విమర్శించారు. జనవరి 26న ఘాజీపూర్ వద్ద, ఆగస్టు 28న కర్నాల్‌లో పోలీసులు దాడితోనే రైతులు మరణించారని తెలిపారు. అందువల్ల ఈ రెండు ప్రభుత్వ హత్యలేనని పేర్కొన్నారు. ప్రధాని మోడీ అడుగుజాడల్లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నడుస్తున్నారనీ, అందుకే రైతు ఉద్యమంపై తొలి నుంచి కత్తి కట్టాడని విమర్శించారు. రైతుల ఉద్యమంలో ఇప్పటి వరకు 40 వేల కేసులు నమోదు చేశారని, అందులో రెండు రాజద్రోహం కేసులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
రైతు సుశీల్ కాజల్‌ది సంస్థాగత హత్య
అమరుడైన రైతు సుశీల్ కాజల్ గత తొమ్మిది నెలలుగా రైతు ఉద్యమంలో ఉన్నారని తెలిపారు. కర్నాల్‌లో రైతులపై జరిగిన లాఠీచార్జిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. ఆయనను మిగిలిన రైతులు ఆస్పత్రికి తరలించా రనీ, కానీ పోలీసులు ఆస్పత్రిలోకి అనుమతించలేదని ఆరోపించారు. రక్తంతో ఇంటికి చేరుకున్నారనీ, ఆ రాత్రే ఆయన మరణించారని తెలిపారు. కానీ పోలీసులు ఆయన గుండెపోటుతో మరణించినట్టు చిత్రీకరించడం దారుణమని విమర్శించారు. ఇది ఖట్టర్ ప్రభుత్వం చేసిన సంస్థాగత హత్య అని స్పష్టం చేశారు. ఓట్లేసిన అన్నదాతలపై ఖట్టర్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా సుదూర రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారని వివరించారు.
బీజేపీకి ఓటేయొద్దు..
రైతు వ్యతిరేకి బీజేపీకి ఓటేయొద్దని మిషన్ ఉత్తరప్రదేశ్ కార్యక్రమం ముజఫర్ నగర్లో జరగనున్నదనీ, దాదాపు ఐదు లక్షల మంది రైతులు చేరుకుంటారని తెలిపారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందని రైతులు వేలాది మంది వస్తారని, మిగతా రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో చేరుకుంటారని చెప్పారు. ఇందులో రైతు శత్రువు కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలనీ, అవి రైతుల డిమాండ్లను వినేందుకు, పరిష్కరించేందుకు సిద్ధంగా లేవనీ, కనుక బీజేపీకి ఓటేయవద్దని పిలుపు ఇవ్వనున్నామని తెలిపారు. రైతు సంఘాల తరఫున ఎన్నికల్లో పోటీ చేయమనీ, కనుక బీజేపీని ఓడించాలని పిలుపు ఇస్తామన్నారు. శత్రువులు ఎవరూ...మిత్రులు ఎవరూ రైతులకు తెలుసని పేర్కొన్నారు.
సుశీల్ హత్యపై న్యాయ విచారణ జరపాలి: కృష్ణప్రసాద్
రైతు సుశీల్ కాజల్ హత్యపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరపాలని ఏఐకేఎస్ కోశాధికారి కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. అలాగే ఏడీఎం ఆయూష్ సిన్హాను వెంటనే సస్పెండ్ చేయాలనీ, ఈ ఘటనలో ఉన్న పోలీసుల (నిందితుల)పై ఐపీసీ 302 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జలియన్‌వాలా బాగ్ దురాగతంలో జనరల్ డయ్యార్ వ్యవహరించినట్టుగా.. కర్నాల్‌లో ఎడిఎం వ్యవహరించారని విమర్శించారు. సుశీల్ కాజల్ హత్యపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు.