Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేండ్లుగా వాయు కాలుష్యం భారీగా పెరుగుతోంది. ఇక భారత్‌లో ఈ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. దీని కారణంగా కోట్లాది మంది అనేక అనారోగ్య సమస్యల బారినపడటంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నవారు సైతం పెరుగుతున్నారు. భారత్‌లో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉందనీ, దాదాపు సగం మంది భారతీయుల ఆయుర్దాయం తగ్గిపోయే ప్రమాదం పొంచివున్నదని తాజాగా అమెరికాకు చెందిన ఓ అధ్యయనం వెల్లడించింది. ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్, చికాగో యూనివర్సిటీ అధ్యయన వివరాల ప్రకారం.. దేశంలోని కోట్లాది మంది ప్రజలు గణనీయంగా అధిక కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీ సహా భారత్‌లోని అన్ని ప్రాంతాల్లో కలిపి 480 మిలియన్లకు పైగా ప్రజలు గణనీయంగా అధిక వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారు. సుమారు 40శాతం మంది భారతీయుల ఆయుర్దాయం తొమ్మిదేండ్లు తగ్గిపోయే అవకాశముందని ఈ నివేదిక పేర్కొంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించింది. ఈ రాష్ట్రాల్లో ప్రజలు 2.5-2.9 ఏండ్ల జీవితాన్ని కోల్పోయే ముప్పు ఉందని తెలిపింది. వాయుకాలుష్యం వల్ల ప్రపంచం కోల్పోయే జీవిత సంవత్సరాల్లో 58శాతం దక్షిణాసియా రీజియన్‌లోనే ఉండనున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక ఐదు కాలుష్య దేశాల్లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్లున్నాయి. ఈ దేశాల్లో 2000 సంవత్సరం తర్వాత రోడ్డుపైకి ఎక్కే వాహనాలు దాదాపు 4 రెట్లు పెరిగాయని తెలిపింది. శిలాజ ఇంధనాల వినియోగమూ గరిష్టంగా ఉంది. 1998 నుంచి 2017నాటికి శిలాజ ఇంధనాల వినియోగం మూడు రెట్లు పెరిగింది. పంట వ్యర్థాలను కాల్చడం, ఇటుక బట్టీలు, ఇతర పారిశ్రామిక కార్యకలాపాల వల్ల కూడా కాలుష్యం పెరుగుతున్నట్టు వివరించింది. కాగా, ప్రమాదకరమైన కాలుష్య స్థాయిలను నియంత్రించడానికి 2019లో ప్రారంభించిన ఇండియన్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ)ను ఈ నివేదిక ప్రశంసించింది. ఎన్సీఏపీ లక్ష్యాలను సాధించడంతో దేశం మొత్తం ఆయుర్దాయం 1.7ఏండ్లు పెరిగినట్టు గుర్తించింది. ఇదిలావుండగా, 2020లో వరుసగా మూడో ఏడాదిలోనూ ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన రాజధానిగా నిలిచింది. గత ఏడాదిలో లాక్డౌన్ ఆంక్షలతో నగరం వేసవిలో రికార్డు స్థాయిలో స్వచ్చమైన గాలిని పీల్చుకోగలిగింది. దేశంలో గాలి నాణ్యతను ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన స్థాయికి మెరుగుపర్చాల్సిన అవసరముందనీ, దీంతో అధిక కాలుష్యం కలిగిన పై నాలుగు దేశాల్లో ప్రజల ఆయుర్దాయం 5.6 ఏండ్లు పెరిగే అవకాశముందని తెలిపింది.