Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాస నివేదిక
న్యూఢిల్లీ : రాబోయే కాలంలో మరిన్ని ప్రకృతి విపత్తలు ఏర్పడే అవకాశముందని ఐక్యరాజ్యసమితికి చెందిన 'ప్రపంచ వాతావరణ సంస్థ' అంచనా వేసింది. గత 50ఏండ్లలో (1979-2019) ప్రకృతి సంబంధమైన విపత్తులు 5రెట్లు పెరిగాయని ఆ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక పేర్కొంది. ముందస్తు హెచ్చరికలు, విపత్తు నిర్వహణ ద్వారా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగామని నివేదిక అభిప్రాయపడింది. 2017 ఏడాదిలో హార్వే, మిరయా, ఇర్మా..తుఫాన్లు అమెరికాను ఆర్థికంగా భారీగా నష్టపర్చాయని నివేదికలో తెలిపారు. వాతావరణ మార్పులు ముందు ముందు మరిన్ని ప్రకృతి విపత్తులు తీసుకువస్తుందని, తరుచుగా అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని 'ప్రపంచ వాతావరణ సంస్థ' ప్రధాన కార్యదర్శి పెట్టేరి టాలాస్ చెప్పారు. యూరప్, ఉత్తర అమెరికాలో వేడిగాలులు, కరువు, అడవుల దహనం..వంటివి మరిన్ని ఏర్పడే అవకాశముందని చెప్పారు.
ఐరాస నివేదికలో పేర్కొన్న మరికొన్ని అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1970-2019 మధ్యకాలంలో 11వేల ప్రకృతి సంబంధమైన విపత్తులు సంభవించాయి. ఈ విపత్తుల్లో దాదాపు 20లక్షల మంది చనిపోయారు. 3.64 ట్రిలియన్ డాలర్ల (సుమారుగా రూ.266లక్షల కోట్లు) నష్టం వాటిల్లింది. కరువు కాటకాలు, అత్యధిక ఉష్ణోగ్రతలు, తుఫాన్లు, వరదలు, వాతావరణ మార్పులు..మొదలైన వాటిపై నివేదికలో విపులంగా వివరించారు.
కరువు కారణంగా 6,50,000 మరణాలు, భారీ తుఫాన్ల వల్ల 5,77,232 మరణాలు, వరదల్లో-58,700, అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల 55,736 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇందులో 91శాతానికిపైగా మరణాలు అభివృద్ధి చెందిన దేశాల్లో నమోదయ్యాయి. ముందస్తు హెచ్చరికలు, మెరుగైన విపత్తు నిర్వహణ ద్వారా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే 1970-2019 మధ్యకాలంలో ఆర్థిక నష్టాలు మాత్రం 7రెట్లు పెరిగాయి.