Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ 'నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్'
- ప్రణాళికకు వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాతీయ నగదీకరణ ప్రణాళిక (నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్-ఎన్ఎంపీ) దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఒకదాని తర్వాత ఒకటిగా ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్న మోడీ సర్కార్ తాజాగా దేశంలోని ప్రభుత్వ ఆస్తులపైనా కన్నేసిందన్న విమర్శలు వస్తున్నాయి. రానున్న నాలుగేళ్ల కాలంలో ఈ ప్లాన్ ద్వారా రూ.6 లక్షల కోట్ల నిధులు సమీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిరంకుశ, అప్రజాస్వామిక ప్రయత్నాలను వ్యతిరేకంగా తమిళనాడులోని వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు ఆందోళనల బాటపట్టాయి.
ఈ ప్రణాళికతో దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన అస్తులను అమ్మడం ద్వారా నిరుద్యోగం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ జాబితాలో రాష్ట్రంలోని నాలుగు విమానాశ్రయాలు, ది నీలగిరి మౌంటైన్ రైల్వే(ఎన్ఎంఆర్), 491.5 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులతో పాటు విఒ చిదంబరం పోర్టు(ట్యూటికోరన్)లోని మూడు ప్రాజెక్టులు, కావేరీ బేసిన్‌లోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా పైప్‌లైన్ ఉన్నాయి. చెన్నరు, మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి ఎయిర్‌పోర్టుల మానిటైజేషన్ ద్వారా రూ.4,694 కోట్లు ఆర్జించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రభుత్వ ప్రణాళికపై సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సుకుమారన్ మాట్లాడుతూ పోర్టులు, ఎయిర్‌పోర్టులను మానిటైజ్ చేసేందుకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి (పీపీపీ) మోడల్‌కు అనుమతి ఇవ్వడం చాలా ప్రమాదకరమైనదని, అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు ఉండే లాభాపేక్ష స్వభావం దేశ భద్రత విషయంలో రాజీపడేలా చేస్తుందని పేర్కొన్నారు. జాతీయ రహదారులను మానిటైజ్ చేయడం ద్వారా వాహనదారులపై మరింత టోల్ భారం పడుతుందని అన్నారు. ఉత్తర కార్గో బెర్త్‌తో సహా ఇతర విఒసి పోర్టు ఆస్తులుగా ఐదు బెర్త్‌ల విలువ రూ.2,999 కోట్లుగా ఉంది. ప్రజల ఆస్తులను అమ్మడం ద్వారా నిధులు సమీకరించాలని ప్రభుత్వం అనుకుంటోందని, ఇది దీర్ఘకాలంలో దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాటర్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యుటిడబ్ల్యుఎఫ్ఐ) ప్రధాన కార్యదర్శి నరేంద్రరావ్ అన్నారు. చారిత్రక ఎన్ఎంఆర్ను ఎన్ఎంపి లిస్టులో చేర్చడాన్ని నీలిగిరీస్ సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. దీన్ని నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించింది. దక్షిణ రైల్వే ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు ఆర్.ఎలన్గోవన్ మాట్లాడుతూ సరుకు రవాణా కారిడార్‌తో సహా తమిళనాడులోని 27 రైల్వే స్టేషన్లు మానిటైజ్ జాబితాలో ఉన్నాయన్నారు.
రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
కేంద్ర ప్రభుత్వ నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ప్రణాళికను వ్యతిరేకిస్తూ సిఐటియు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వివిధ రంగాల్లో కార్మికులు నిరసనలు తెలుపుతున్నారు. ఎన్ఎంపి దేశ ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని సిఐటియు రాష్ట్ర ఉపప్రధాన కార్యదర్శి ఎస్.కన్నన్ పేర్కొన్నారు. ''తమిళనాడులో ప్రభుత్వ రంగ సంస్థలు తక్కువగా ఉన్నాయి. ఉపాధి కల్పించే రైల్వేలు, బిఎస్ఎన్ఎల్తో పాటు ఇతర మెజార్టీ ప్రభుత్వ సంస్థలను మానిటైజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని వలన ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగం పెరుగుతుంది' అని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మిక సంఘాలు తమ నిరసనలను తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. ''కార్మిక సంఘాల బలమైన నిరసనలు కేంద్రం ప్రైవేటీకరణ ప్రయత్నాలను నియంత్రించాయి. రాష్ట్రంలోని సేలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కార్మికులు అడ్డుకున్నారు. బిజెపి ప్రభుత్వ ప్రణాళికలను అడ్డుకునేందుకు ఇలాంటి నిరసనలు మరింత ఉధృతంగా జరుగుతాయి''అని సుకుమారన్ హెచ్చరించారు.