Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీల్లోనూ మానిటైజేషన్
- గ్రామసభల్లో జాబితా గుర్తించాలి: కేంద్రం
న్యూఢిల్లీ : గ్రామ స్వరాజ్యానికి, స్వావలంబనకు నరేంద్రమోడీ ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతోంది. ఆస్తులను తెగనమ్మడం ద్వారానే పంచాయతీలు తమకాళ్లమీద తాము నిలబడుతాయని అంటోంది. దీనిని ఆచరణలో తేవడానికి ప్రభుత్వ రంగ ఆస్తులను తెగనమ్మడానికి ఉద్దేశించిన మానిటైజేషన్ విధానాన్ని పల్లెసీమల్లోనూ అమలు చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో ప్రయివేటుకు అప్పచెప్పడానికి అవకాశం ఉన్న ఆస్తులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పచ్చటి పల్లె సీమలు కూడా ప్రయివేటు రక్కసి బారిన పడనున్నాయి.ఊరుమ్ముడి ఆస్తులు రానున్న రోజుల్లో కార్పొరేట్ల కబంధ హస్తాల్లోకి వెళ్లనున్నాయి.వీటన్నింటికి మించి పంచాయతీలకు నిధులు కేటాయించే రాజ్యాంగ బద్ద బాధ్యత నుండి కేంద్రం తప్పుకునే పెను ప్రమాదమూ ఉంది.స్వావలంబనకు,మానిటైజేషన్‌కు ముడి పెట్టడమే ఈ ఆందోళనకు కారణం. పంచా యతీలు స్వావలంబన సాధించాలని ఆర్థిక సంఘాలు సూచించిన విషయం తెలిసందే.దీనిని సాధించడానికి మానిటైజేషన్‌ను అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు పంపిన ఆదేశాల్లో పేర్కొంది.ఆగస్టు 16వ తేదిన ఈ మేరకు ఆదేశాలు కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు అందాయి.పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సునీల్‌కుమార్ సంతకంతో వచ్చిన ఈ ఆదేశాల్లో కేంద్రం త్వరలోనే మానిటైజేషన్ విధానాన్ని ప్రకటించనుందని,అక్టోబర్ నెల నుండి దేశవ్యాప్తంగా ఆ విధానం పెద్ద ఎత్తున అమలు కానుందని,ఆ సమయానికి పంచాయతీలను కూడా సిద్ధం చేయాలని సూచించింది.
12 కీలకాంశాలు...
గ్రామసభలు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించిన కేంద్రం ఆ సభల్లో చర్చించడానికి 12 కీలకాంశాలను సూచించింది. వీటిలో మొట్టమొదటిదే మానిటైజేషన్ ప్రక్రియకు సంబంధించింది కావడం గమనార్హం. ఆదేశాలు అందిన తరువాత నిర్వహించే మొట్టమొదటి గ్రామసభలోనే దీనిని చర్చించాలని పేర్కొంది. దీనికి సంబంధించి పంచా యతీల సొంత ఆదాయ వనరులు పెంచుకునే మార్గాలపై చర్చ జరపాలని ఆదేశించింది. దీనిలో భాగంగా ఆస్తుల మానిటైజేషన్ అంశాన్ని చర్చించాలని పేర్కొంది. ఆస్తిపన్ను వృత్తిపన్ను, ఉమ్మడి ఆస్తులను లీజుకివ్వడం, సర్వీసు ఛార్జీలు విధించడం వంటి చర్యలపై చర్చ జరిగి నిర్ణయాలు చేయాలని సూచించింది. మానిటైజేషన్ చేయడానికి వీలైన ఆస్తులను సాధ్యమైనంత వరకు మొదటి సమావేశంలోనే గుర్తించాలని పేర్కొంది. కనిష్టంగా సంవత్సరానికి ఆరు, గరిష్టంగా 12 గ్రామసభలు నిర్వహించాలని సూచించింది.
ఎన్ని పంచాయతీలు...
కేంద్ర మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 2,55,366 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటికి 15వ ఫైనాన్స్ కమిషన్ 2021-26 మధ్య కాలానికి 2,36,805 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇది 14వ ఫైనాన్స్ కమిషన్‌తో పోలిస్తే దాదాపుగా 55 వేల కోట్ల రూపాయలు ఎక్కువ! ఈ కేటాయింపులను సాధ్యమైనంత మేర తగ్గించుకునే ప్రక్రియలో భాగంగానే కేంద్రం మానిటైజేషన్‌ను పంచాయతీలకూ వర్తింపచేస్తోందని భావిస్తున్నారు.