Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యం తక్కువే
- సుప్రీంకోర్టులో నలుగురు..
- హైకోర్టుల్లో 77 మంది మాత్రమే..!
న్యూఢిల్లీ : దేశ న్యాయవ్యవస్థలోనూ లింగ వివక్ష ఆందోళన కలిగిస్తున్నది. ఇక్కడ మహిళా న్యాయమూర్తుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టులో మహిళా సిట్టింగ్ జడ్జిల సంఖ్య అధికంగానే ఉన్నప్పటికీ.. ఇక్కడా మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యం మాత్రం తక్కువగానే ఉన్నది.కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. దేశ సర్వోన్నత న్యాయస్థానంతో పాటు హైకోర్టులలో మహిళా జడ్జిల సంఖ్య 12 శాతంగానే ఉన్నది. సుప్రీంకోర్టు, హైకోర్టులలో మొత్తం 677 మంది సిట్టింగ్ జడ్జిలు ఉన్నారు. అయితే, వీరిలో మహిళా జడ్జిల సంఖ్య 81 మాత్రమే (12 శాతం) కావడం గమనార్హం. సుప్రీంకోర్టులో ఇటీవలే ముగ్గురు మహిళా జడ్జిల చేరికతో సిట్టింగ్ మహిళా జడ్జిల సంఖ్య చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యధికంగా నాలుగుకు చేరినప్పటికీ.. వారి ప్రాతినిధ్యం ఆందోళన కలిగిస్తున్నది. సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది వర్కింగ్ జడ్జిలు ఉన్నారు. ఇందులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 12 శాతమే కావడం గమనార్హం.ఇక దేశవ్యాప్తంగా 25 హైకోర్టులలో కేటాయించిన జడ్జిల సంఖ్య 1098. అయితే, ఇందులో 454 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం 644 మంది వర్కింగ్ జడ్జిలలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 77 మాత్రమే ఉన్నది. అంటే, ఇది కేవలం 12 శాతం.
హైకోర్టుల వారీగా చూసుకుంటే.. మద్రాసు హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య రెండెంకెలుగా ఉన్నది. ఇక్కడ, మొత్తం 58 మంది వర్కింగ్ జడ్జిలలో 13 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. అంటే వీరి ప్రాతినిధ్యం 22 శాతంగా ఉన్నది. ఇక తర్వాతి స్థానంలో ఉన్న బాంబే హైకోర్టులో 63 మంది సిట్టింగ్ జడ్జిలకు గానూ ఎనిమిది మంది మహిళా న్యాయమూర్తులు (13 శాతం) ఉన్నారు. అలహాబాద్ (ఏడు శాతం), పంజాబ్ అండ్ హర్యానా (15 శాతం) హైకోర్టులలో ఏడుగురు చొప్పున మహిళా జడ్జిలు ఉన్నారు. ఢిల్లీ, కర్నాటక హైకోర్టులలో ఆరుగురు చొప్పున, గుజరాత్లో ఐదుగురు మహిళా న్యాయమూర్తులున్నారు. ఇక కలకత్తా, కేరళ హైకోర్టులలో నలుగురు చొప్పున మహిళా న్యాయమూర్తులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ లలో ఇద్దరు చొప్పున, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లలో ముగ్గురు చొప్పున మహిళా జడ్జిలు మాత్రమే ఉన్నారు. ఇక మణిపూర్, మేఘాలయ, బీహార్, త్రిపుర, ఉత్తరాఖండ్ వంటి ఐదు రాష్ట్రాల్లో కనీసం ఒక్క మహిళా జడ్జి కూడా లేకపోవడం గమనార్హం. గౌహతి, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ అండ్ లఢక్, జార్ఖండ్, ఒరిస్సా, రాజస్థాన్, సిక్కిం హైకోర్టులలో కేవలం ఒక్కరు చొప్పున మహిళా న్యాయమూర్తులు ఉన్నారు.