Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌కు వినతి
ముంబయి: పంట బీమా పరిహారం ఇవ్వాలని ఏఐకేఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మహారాష్ట్రలోని పూణేలో భారీ ఆందోళన చేపట్టింది. ఏఐకేఎస్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని వెనుకబడిన మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు పూణేలోని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఏఐకేఎస్ ప్రతినిధి బృందం మహారాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ధీరజ్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇప్పటికే తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎత్తి చూపారు. అనంతరం ముంబయిలోని సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి దాదా భూసేతో ఏఐకేఎస్ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద ప్రీమియం చెల్లించిన లక్షలాది మంది రైతులకు కోట్ల రూపాయాల విలువైన పంట భీమా పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధిక వర్షాల కారణంగా విపరీతమైన పంట నష్టాన్ని చవిచూశారనీ, పంటల బీమా కంపెనీల నుంచి పరిహారం అందలేదన్నారు. తాము చేసిన ఈ ఆందోళనతో మోడీ ప్రభుత్వం పీఎంఎఫ్‌బీవై దివాలాను పూర్తిగా బహిర్గతం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ కంపెనీల కంటే ప్రయివేట్ రంగ బీమా కంపెనీలు రైతులకు తక్కువ పంట బీమా పరిహారాన్ని చెల్లించాయనీ, రైతులను దోచుకుంటున్నాయని విమర్శించారు. అనంతరం ధర్నాను ఉద్దేశించి మహారాష్ట్ర ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిసాన్ గుజార్, డాక్టర్ అజిత్ నవాలే, రాష్ట్ర కోశాధికారి ఉమేశ్ దేశ్‌ముఖ్, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే వినోద్ నికోల్, సీఐటీయూ నాయకుడు అజిత్ అభ్యంకర్, ఏఐకేఎస్ రాష్ట్ర నాయకులు అడ్వరు అజరు బురండే ప్రసంగించారు. ఈ ధర్నాలో రైతు నేతలు దీపక్ లిపనే, గోవింద్ అర్దాద్, భగవాన్ భోజనే, సంజరు మోర్, మహాదేవ్ గార్పవర్, జితేంద్ర చోప్డే, దిగంబర్ కాంబ్లే, మాణిక్ అవఘడే, అమోల్ వాగ్మారే, చంద్రకాంత్ ఘోరానాలతో పాటు గత రెండేండ్లుగా ఈ సమస్యపై పోరాటాన్ని నిర్వహిస్తున్నఏఐకేఎస్ నాయకత్వం వహిస్తున్న బీడ్ జిల్లా నుంచి రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మరాఠ్వాడాలోని పర్భని, జల్నా, ఔరంగాబాద్, లాతూర్ జిల్లాలు, విదర్భలోని అమరావతి, బుల్దానా జిల్లాల నుంచి కూడా రైతులు ఆందోళనలో భాగస్వామ్యమయ్యారు. పశ్చిమ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్, సాంగ్లీ, సతారా, పూణే జిల్లాలు, కొంకణ్‌లోని పాల్ఘర్ జిల్లా నుంచి కూడా రైతులు ఆందోళనలో పాల్గొన్నారు.