Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్, ఎస్పీకి ఎన్హెచ్ఆర్సీ ఆదేశం
- హర్యానా సీఎం ఖట్టర్ దిష్టి బొమ్మల దహనం
- ఢిల్లీలో ఐలు ఆందోళన
- రైతులపైకి ఉసిగొల్పిన ఎస్డీఎం బదిలీ
న్యూఢిల్లీ: కర్నాల్‌లో జరిగిన లాఠీచార్జ్ ఘటనకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని హర్యానా ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. ఈ మేరకు కర్నాల్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి నోలీసులు జారీ చేసింది. మరోవైపు రైతులు, వివిధ ప్రజా సంఘాలు హర్యానా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశాయి. హంతకుడైన ఎస్డీఎంను తక్షణమే తొలగించాలనీ, అతనిపై హత్య కేసు నమోదు చేయాలని పశ్చిమ బెంగాల్, అసోం, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి.
ముజఫర్‌నగర్ కిసాన్ మహాపంచాయత్‌కి సన్నాహాలు
మిషన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భాగంగా సెప్టెంబర్ 5న ముజఫర్ నగర్ కిసాన్ మహా పంచాయత్ కోసం సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్ జిల్లాలలో సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సన్నాహక సమావేశాలలో వేలాది మంది రైతులు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రైతులు సమీకరిస్తున్నారు. ఎస్కేఎం జాతీయ కన్వెన్షన్ పిలుపులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర స్థాయి సమావేశాలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో సెప్టెంబర్ 9-10 తేదీల్లో లక్నోలో సమావేశం జరగనుంది. మధ్యప్రదేశ్‌లో సెప్టెంబర్ 3న, బీహార్‌లో సెప్టెంబర్ 11న సమావేశాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 25 లోపు అన్ని రాష్ట్రాలలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని ఎస్కేఎం నిర్ణయించింది.
లాఠీచార్జ్‌కు వ్యతిరేకంగా ఐలు ర్యాలీ
హర్యానాలోని కర్నాల్‌లో ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న రైతులపై చట్ట విరుద్ధంగా క్రూరమైన లాఠీచార్జ్‌కు వ్యతిరేకంగా ఆలిండియా లాయర్స్ యూనియన్(ఐలు)ఢిల్లీ కమిటీ ర్యాలీ నిర్వహించింది. గురువారం నాడిక్కడ ఇండియన్ లా ఇన్సిట్యూట్ గేట్ వద్దకు చేరుకున్న ఐలు కార్యకర్తలు లాయర్స్ విత్ ఫార్మర్స్ నినాదంతో సుప్రీం కోర్టు నుంచి హర్యానా భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం అక్కడ హర్యానా భవన్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవాలనీ,స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలనీ,వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయొద్దని నినదించారు.కర్నాల్‌లో రైతులపై లాఠీచార్జ్ చేయడానికి కారణమైన ఎస్డీఎం,ఇతర పోలీసులను వెంటనే సర్వీస్ నుంచి సస్పెండ్ చేయాలనీ,వారిపై సుశీల్ కాజల్ హత్యకు సంబంధించిన ప్రాసిక్యూషన్‌తో సహా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నాల్‌లో జరిగిన సంఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని కోరారు.మరణించిన బాధిత రైతు సుశీల్ కాజల్ కుటుంబానికి తగిన పరిహారం అందించాలనీ, పోలీసుల లాఠీఛార్జ్‌లో గాయపడిన రైతులందరికీ పరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐలు ప్రధాన కార్యదర్శి పి.వి సురేంద్రనాథ్,ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సునీల్ కుమార్,ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్,కోశాధికారి పి.కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పంజాబ్‌లో విరిగిన లాఠీ రైతులపై జలఫిరంగులతో ఖాకీల ప్రతాపం
పంజాబ్‌లోని మోగాలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు వాటర్ కెనాన్స్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేశారు. గురువారం మోగాలోని కొత్త ధాన్యం మార్కెట్‌కు వెలుపల జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించారు. ధర్నాను ఉద్దేశించి ఎస్ఏడీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతున్న సందర్భంలో పోలీసులు లాఠీచార్జ్ జరిపారు. బలవంతంగా వారిని చెదరగొట్టడంతో పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగడంతో ఐదుగురు రైతులు గాయపడ్డారు. ఈ ఘటనలో పది కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటికే మోగా పోలీసులు వైఖరిపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే పోలీసులు బుధవారం రాత్రి స్థానిక రైతు సంఘాల కార్యకర్తల ఇండ్లపై దాడి చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఏడీ నాయకులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులు తమను నిరోధించారని రైతు నాయకుడు బలదేవ్ సింగ్ జిరా ఆరోపించారు. ''మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టడానికి అకాలీ నాయకత్వం బీజేపీకి మద్దతు ఇచ్చినందున మేం ధృఢ సంకల్పంతో నిరసనలను కొనసాగిస్తాం'' అని ఆయన పేర్కొన్నారు. రైతులపై ఖాకీల వీరంగాన్ని సంయుక్త కిసాన్ మోర్చా ఖండించింది. అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
రైతులపై ఉసిగొల్పిన ఎస్డీఎం బదిలీ
రైతుల తలలు పగలడం తాను చూడాలని ఆదేశించిన ఎస్డీఎం ఆయుష్ సిన్హాను హర్యానా ప్రభుత్వం బదిలీ చేసింది. కర్నాల్ ఎస్డీఎంగా ఉన్న ఆయనను హర్యానా సీఆర్ఐడీ సంయుక్త కార్యదర్శిగా బదిలీ చేశారు. అయితే దీనిపై ఎస్కేఎం తీవ్రంగా స్పందించింది. హర్యానా ప్రభుత్వ తీరు ఆయనపై చర్యలు తీసుకున్నట్లుగా లేదనీ, ఆయనకు పదోన్నతి కల్పించినట్టు ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేసింది. రైతు సుశీల్ కాజల్ హత్యకు, వందలాది మంది రైతుల గాయాలు పాలవ్వడానికి కారణమైన ఎస్డీఎం ఆయుష్ సిన్హా, ఇతర అధికారులను బదిలీ చేయడం వారికి భద్రత, పదోన్నతి కల్పించడం మాత్రమేనని ఎస్కేఎం విమర్శించింది. సెప్టెంబర్ 6 లోపు ఎస్‌డీఎంపై హత్య కేసు నమోదు చేయకపోతే, ఆయనను తొలగించకపోతే, సెప్టెంబర్ 7 నుంచి కర్నాల్‌లోని మినీ సచివాలయాన్ని రైతులు ఘెరావ్ చేస్తారని ఎస్కేఎం హెచ్చరించింది.
వరి కొనుగోళ్లపై కేంద్ర ఆంక్షలు
వరి కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా రైతుల ఆగ్రహం పెరుగుతోందని ఎస్కేఎం పేర్కొంది. కొత్త ప్రమాణాల్లో విరిగిన ధాన్యాల కొనుగోలు 25 శాతం నుంచి 20 శాతానికి, తేమ శాతం 15 శాతం నుంచి 14 శాతానికి తగ్గించింది. దెబ్బతిన్న వరి కొనుగోలు శాతం 3శాతం నుంచి 2శాతానికి తగ్గించింది. ఇప్పటి వరకు 3 శాతం పరిమితి ఉన్న ఎర్ర ధాన్యాలు ఇకపై కొనుగోలు చేయబడవని ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల్లో పేర్కొంది. రైతుల నిరసనతో పాటు, కొత్త నిబంధనలను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా వ్యతిరేకిస్తోంది. పంజాబ్‌లోని వ్యవసాయ సంఘాలు కొత్త నిబంధనలను అంగీకరించడానికి నిరాకరించాయి.