Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచంలో 400 కోట్ల మందికి అందని సాయం
- ప్రసవ మహిళల్లో 45శాతం మందికే నగదు బదిలీ వర్తింపు
- వికలాంగుల్లో ప్రతి ముగ్గురిలో ఒక్కరికే పథకం ప్రయోజనం
- కరోనాను ఎదుర్కొనే చర్యలు సరిపోవు
న్యూఢిల్లీ : అత్యంత భీకరమైన కరోనా మహమ్మారి మానవాళిని కబళిస్తున్నా..ఇప్పటికీ సామాజిక భద్రత లేనివారు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లమందికిపైగా ఉన్నారని 'అంతర్జాతీయ కార్మిక సమాఖ్య'(ఐఎల్ఓ) తాజా నివేదిక తెలిపింది. కరోనా మహమ్మారి ప్రబలిందని తెలిసిన తర్వాత కూడా ఆయా దేశాల్లో సరైన చర్యలు చేపట్టలేదని, ధనిక దేశాలకు, పేద దేశాలకు అంతరాలు పెరిగాయని ఐఎల్ఓ నివేదిక పేర్కొంది. 'వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ 2020-22: సోషల్ ప్రొటెక్షన్ ఎట్ ద క్రాస్‌రోడ్స్' అనే పేరుతో విడుదలైన నివేదిక పేర్కొన్న మరికొన్ని అంశాలు ఈ విధంగా ఉన్నాయి. సామాజిక భద్రత విషయంలో ఆయా దేశాలు చేపట్టిన చర్యలు, ఫలితంగా అందులో జరిగిన అభివృద్ధిని నివేదిక ప్రస్తావించింది. ముఖ్యంగా సామాజిక భద్రత తేడాను తగ్గించడానికి విధానపరమైన సూచనలు చేసింది.
ప్రస్తుతం ప్రపంచంలో కనీసం ఒక సామాజిక భద్రత పొందినవారు 47శాతం మంది ఉన్నారు. 410 కోట్లమందికి ఆదాయ భద్రత లేదు. సామాజిక భద్రతకు సంబంధించి వివిధ ప్రాంతాల మధ్య అసమానతలు తీవ్రంగా ఉన్నాయి. యూరప్, మధ్య ఆసియా దేశాల్లో జాతీయ స్థాయిలో ఏదో ఒక సామాజిక భద్రత అందుకుంటున్నవారు 84శాతం మంది ఉన్నారు. అమెరికాలో ఇది 64.3శాతం, ఆసియా పసిఫిక్‌లో 44శాతం, అరబ్ దేశాల్లో 40శాతం, ఆఫ్రికాలో 17.4శాతం నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు సరైన సామాజిక భద్రతా పథకం అమలు కావటం లేదు. కనీసం ఒక పథకం కవరేజ్ ఉన్న పిల్లలు 26.4శాతం మంది మాత్రమే.
ప్రభుత్వ వ్యయం పెరగాలి..
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సామాజిక భద్రతపై ప్రభుత్వ వ్యయంలో కోతలు విధిస్తున్నాయి. కరోనా సంక్షోభ సమయాన సామాజిక భద్రతా పథకాలపై ప్రభుత్వ పెట్టుబడి పెరగాల్సిన అవసరముందని ఐఎల్ఓ డైరెక్టర్ షాహ్రా రజ్వీ చెప్పారు. ప్రసూతి ప్రయోజనాల్లో భాగంగా అమలుజేస్తున్న నగదు బదిలీ పథకం 45శాతం మందికి మాత్రమే అందుతోంది. అలాగే వికలాంగుల్లో చాలా మందికి ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలు వర్తించటం లేదు. నగదు సాయం ప్రతి ముగ్గురులో ఒక్కరికి (33.5శాతం) మాత్రమే అందుతోంది. చాలా దేశాల్లో నిరుద్యోగ భత్యమే లేదు. అమలుచేస్తున్న దేశాల్లోనూ చాలా తక్కువ మొత్తం అందజేస్తున్నారు. ప్రపపంచవ్యాప్తంగా 18.6శాతం మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందుతోంది. రిటైర్మెంట్ వయస్సు దాటినవారిలో 77.5శాతం మందికి సామాజిక పెన్షన్లు అందుతున్నాయి. అయితే ఇందులో ప్రాంతాలకు ప్రాంతాలకు మధ్య, పురుషులకు, మహిళలకు మధ్య అసమానతలు ఉన్నాయి. ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు సామాజిక భద్రతపై జీడీపీలో సగటున 12.8శాతం ఖర్చు చేస్తున్నాయి. ధనిక దేశాలు తమ జీడీపీలో 16.4శాతం, పేద దేశాలు 1.1శాతం ఖర్చుచేస్తున్నాయని ఐఎల్ఓ తెలిపింది.